నెల్లూరు: పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తుందని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కాకాణి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరును ఖండిస్తున్నాం. ఇరిగేషన్‌లో అవినీతి ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి నోరు డ్రైనేజీ కంటే అధ్వాన్నంగా ఉంది. తూ.తూ మంత్రంగా పనులు ముగించి నీళ్ళు వదిలితే ఆ పనుల్లో నాణ్యత ఎలా ఉంటుంది. టెండర్ల కంటే ముందే పనులు ముగించిన అవినీతి ఘనత సోమిరెడ్డిది. పూడికతీత పనులు ఎంత నాణ్యతగా ఉన్నాయో ఇవే సాక్ష్యాలు అంటూ ఫోటో ప్రూఫ్ మీడియాకు చూపించారు. నవంబర్ ఏడో తేదీన నీళ్ళు వదిలిన ఘనతను దినపత్రికలే సాక్షిగా చెబుతున్నాయి. నీకు అనుకూలంగా వున్న కొద్ది మంది రైతుల దగ్గర పనులు జరగలేదని చెప్పించడం కాదు. మొత్తం కనుపూరు కాలువ మీద 30 కోట్ల అవినీతి జరిగింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారు రిటైర్ అయినా సరే జైలుకు వెళ్లక తప్పదు. సోమిరెడ్డి చేస్తున్న పనుల్లో అవినీతి కట్టలు తెంచుకుని ప్రవహిస్తోంది. విచారణలో అవకతవకలు జరిగినట్లు తేలితే దాని మీద మళ్ళీ విచారణ చేయిస్తాం. పాత కేసులు తోడి నన్ను భయపెట్టాలని చూస్తున్నారు.. ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. స్టేట్‌మెంట్‌తో మీరు స్ట్రిక్ట్ ఆఫీసర్లు కాలేరు. చిత్తశుద్ధితో పని చేయాలి. మద్యం షాపుల్లో ఎంఆర్‌పీ రేటు కంటే ఎక్కువ విక్రయిస్తే జరిమానాలు అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలు చేశామని రెండు కేసులు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై క్యాష్ కొట్టు.. షాప్ పట్టు అని ఇప్పుడు కూడా చెబుతున్నాను. మీ అవినీతిని ఎప్పటికప్పుడు బయటకు చెబుతూనే ఉంటానని కాకాణి హెచ్చరించారు.