ఆదోని ప్రత్యేక జిల్లా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఉధృతం

37 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 

దీక్ష‌ల్లో పాల్గొన్న వైయ‌స్ఆర్‌సీపీ ముఖ్య నేత‌లు

కర్నూలు జిల్లా : ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే ప్రజల డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. ఈ డిమాండ్‌కు మద్దతుగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయ‌స్ఆర్ సీపీ) నేతలు, కార్యకర్తలు ఉద్యమ బాట పట్టారు. ఆదోని జిల్లాగా ప్రకటించాలంటూ గత 37 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు ప్రజా ఉద్యమంగా మారాయి.
ఆదోని కేంద్రంగా సాగుతున్న ఈ దీక్షల్లో ఐదు నియోజకవర్గాలకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డా. మధుసుదన్, పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మంత్రాలయం నియోజకవర్గ నాయకుడు ప్రదీప్ రెడ్డి, ఆలూరు నియోజకవర్గ నాయకుడు చంద్రశేఖర్, త‌దిత‌ర నాయ‌కులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఆదోని ప్రాంతానికి ఉన్న చారిత్రక, భౌగోళిక, ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను వారు బలంగా వినిపించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..ఆదోని ప్రాంతం గత ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేదని, జిల్లా కేంద్రంగా మారితే పరిపాలనా సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని తెలిపారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాల్లో ఆదోనికి విస్తృత అవకాశాలున్నాయని, జిల్లా ఏర్పాటు వల్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు చిన్న చిన్న పరిపాలనా అవసరాల కోసం కర్నూలు వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఇది సమయం, ఖర్చు, శ్రమ వృథా చేస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిని జిల్లా చేస్తే మండలాలు, నియోజకవర్గాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఏర్పాటు చేయవచ్చని, దాంతో ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న్‌ మాట్లాడుతూ..“ఇది రాజకీయ డిమాండ్ కాదు.. ప్రజల ఆకాంక్ష. ఆదోని జిల్లాగా మారాలన్నది ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. 37 రోజులుగా ప్రజలు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల స్వరాన్ని వినాలి” అని పిలుపునిచ్చారు.
ఈ ఉద్యమం పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగుతుందని, ఆదోని జిల్లాగా ప్రకటించే వరకు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని వారు తెలిపారు.దీక్షా శిబిరం వద్ద భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొనడంతో ఆదోని జిల్లా డిమాండ్ మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు వచ్చింది.

Back to Top