కులగణనను వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోంది

జనగణనతో పాటే కులగణన జరిగితేనే అట్టడుగువర్గాలకు మేలు

దేశంలో కులగణనను చేపట్టింది వైయస్ జగన్ ప్రభుత్వమే

ఈ నివేదికను కూటమి ప్రభుత్వం బయటకు రానివ్వడం లేదు

తక్షణం ఈ నివేదికను బయటపెట్టాలి

వైయస్ఆర్‌సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ డిమాండ్

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్

తాడేపల్లి: కేంద్రప్రభుత్వం జనగణనతో పాటు కులగణనను చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని వైయస్ఆర్‌సీపీ స్వాగతిస్తోందని పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటిగా కులగణనను చేపట్టింది వైయస్ జగన్ ప్రభుత్వమేనని వెల్లడించారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో చేపట్టిన ఈ కులగణన నివేదికను కూటమి ప్రభుత్వం దురుద్దేశంతోనే బహిర్గతం చేయడం లేదని మండిపడ్డారు. 

ఇంకా ఆయనేమన్నారంటే...

కులాల వారీగా జనగణన గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వైయస్ఆర్‌సీపీ సంపూర్ణంగా మద్దతు ఇస్తోంది. 1931లొ దేశవ్యాప్తంగా కులగణన జరిగింది. తరువాత సమగ్ర కులగణన చేసిన దాఖలాలు లేవు. కులాల వారీగా జనగణన చేయడం వల్ల ఆయా కులాల సామాజిక, ఆర్థిక, విద్యా పురోగతిని తెలుసుకునేందుకు దోహదం చేస్తుంది. కులాల్లోని వెనుకబడిన వారికి చేయూత ఇచ్చేందుకు, ప్రభుత్వ పథకాలను అందచేసి వారిని అభివృద్దిలో భాగస్వామ్యం చేయడానికి వీలవుతుంది. అందుకే జగగణనను కులాల వారీగా చేయడాన్ని స్వాగతిస్తున్నాం. వైయస్ జగన్ తన పరిపాలనా కాలంలో అట్టడుగు వర్గాలకు చేయూతను అందించి, వారిని ప్రగతి వైపు నడిపించేందుకు కృషి చేశారు. అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లీం, అగ్రవర్ణపేదల సంక్షేమం, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా కృషి చేశారు. ఆయన అమలు చేసిన డీబీటీతో పాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారు. 

అభివృద్ది, సంక్షేమంలో వారిని భాగస్వాములను చేసిన గొప్ప సంస్కర్త వైయస్ జగన్. కులం, మతం, పార్టీని ప్రాతిపాదికగా తీసుకోకుండా అర్హులైన వారికి సంక్షేమాన్ని అందించిన గొప్ప నాయకుడు వైయస్ జగన్. కూటమి ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమాన్ని అందించాలంటే కులం, మతం, పార్టీ ఏమిటీ అని వివక్ష చూపుతున్నారు. అభివృద్ది, సంక్షేమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళేందుకు కులాల వారీగా జనాభాను లెక్కించాలని గతంలోనే వైయస్ జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బీసీకుల గణన చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి, 2021లోనే కేంద్రానికి పంపించిన మొట్టమొదటి రాష్ట్రం ఏపీ. 

చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని రాష్ట్ర పరిధిలో కుల గణన చేయాలని 2024లో ఆరుగురు సీనియర్ అధికారుల కమిటీని ఏర్పాటు చేసి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కుల గణన చేపట్టారు. ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఏపీలో వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన కులగణన. తరువాత ఎన్నికలు రావడంతో వైయస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన కులగణన నివేదిక కూటమి ప్రభుత్వం వద్ద ఉంది. ఈ నివేదికను ప్రజల ముందు పెట్టాలని అనేక సార్లు వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. కానీ చంద్రబాబుకు బీసీలు, వెనుకబడిన వర్గాల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదు కాబట్టి, గత ప్రభుత్వం చేసిన కులగణన నివేదికను బయటపెట్టడం లేదు. దీనిని బహిర్గతం చేస్తే అణగారిన కలాల గురించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి. బీసీల పట్ల చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలు. అట్టడుగు వర్గాలకు అండగా నిలించి, అధికారాన్ని అందించిన నాయకుడు వైయస్ జగన్ మాత్రమే. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి కులగణనను బయటపెట్టాలి. ఆయా కులాల్లో వెనుకబడిన వారి అభివృద్ది, తద్వారా దేశ సమగ్రాభివృద్దికి కులాల వారీ జనగణన ఉపయోగపడుతుంది. అందుకే కేంద్రం చేపడుతున్న జనగణనను కులాల వారీగా చేయాలనే దానికి మద్దతు ఇస్తున్నాం.

Back to Top