రాజమహేంద్రవరం: వచ్చే ఏడాది దేశ జనాభాను కులాలవారీగా గణించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తోంది. దేశంలో కులాల వారీగా జనగణన చివరిగా 1931లో చేపట్టారు. ఆతర్వాత సమగ్రంగా కులగణన చేసిన దాఖలాలు లేవు. కులాల వారీగా జనగణన వల్ల ఆయా కులాల్లో ప్రస్తుతం ఉన్న సామాజిక, విద్య, ఆర్థిక పురోగతిని తెలుసుకోవడానికి చాలా దోహదపడుతుంది. దీనివల్ల ఆయా కులాల్లోని వెనకబడ్డ వారికి చేయూత ఇవ్వడానికి వీలుగా ఆయా ప్రభుత్వాలు సరైన రీతిలో కార్యక్రమాలు రూపొందించడానికి, చేయడానికి అవకాశం కలుగుతుంది. అభివృద్ధిలో వారికి దీటైన భాగస్వామ్యం లభిస్తుంది. దీన్ని బలంగా విశ్వసించిన మా నాయకులు వైయస్.జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన కాలంలో ఆయా కులాల అభ్యున్నతికి విశేషంగా కృషిచేశారు. అన్నిరంగాల్లో ఆయా కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచడానికి చరిత్రలో ఎన్నడూలేని రీతిలో కృషిచేశారు. డీబీటీ పథకాల అమలుతోపాటు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందించారు. అభివృద్ధిలో వారిని భాగస్వామ్యం చేశారు. ఈ కార్యక్రమాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లడానికి కులాల వారీగా జనాభాను లెక్కింపు, దాని ఆవశ్యకతను చాటుతూ ఆమేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. దేశవ్యాప్తంగా జనాభాను లెక్కించేది కేంద్రం కాబట్టి, బీసీ కులాల వారీగా జనాభాను లెక్కించాలని కోరుతూ 2021 నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానంకూడాచేసి కేంద్రానికి పంపించారు. దీని తర్వాత వైయస్.జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం పరిధిలో కులాల గణను చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు ఆరుగురు సీనియర్ అధికారులను నియమించారు. తద్వారా 2024 జనవరిలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కులగణన చేపట్టి, దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆ తదుపరి ఎన్నికలు రావడంతో ఈ లెక్కలతో కూడిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చెంతనే ఉంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ నివేదికను ప్రజలముందు పెట్టాలని పలుమార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరడంకూడా జరిగింది. వెనకబడ్డ కులాల్లో సహా ఆయా కులాల్లో వెనకబడ్డ వారి అభివృద్ధి తద్వారా దేశ సమాగ్రాభివృద్ధికి ఈ కులాల వారీ జనాభా గణన దోహదపడుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతోంది. అందుకే ఇప్పుడు కేంద్రం చేపడుతున్న జనాభా గణనలో కులాలవారీగా లెక్కింపు చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.