వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

అభివృద్ధి వికేంద్రీకరణపై కుట్ర చేసేవారికి సుప్రీం కోర్టు గట్టి మొట్టికాయలు

మూడు రాజధానులకు మద్దతుగా డిసెంబర్‌ 5న కర్నూలులో భారీ సభ

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో డిసెంబర్‌ 5న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు టీడీపీ నేతలు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వికేంద్రీకరణను అడ్డుకోవాలని కుట్రలు చేసిన వారికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు గట్టి మొట్టికాయల్లాంటివన్నారు. కర్నూలులో సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

‘‘ఏకైక రాజధాని ఉండాలని, ఒకే ప్రాంతం అభివృద్ధి చెందాలనేది ఒకరి విధానం అయితే.. దానికి ప్రజామోదం ఉంటే 2019లో వ్యక్తమయ్యేది. అమరావతి పెట్టిన చోటే తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని, చంద్రబాబు ఆలోచనను ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకించారనేది ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. రాష్ట్రంలోని ఆర్థిక వనరులన్నీ అమరావతి మీదనే పెట్టాలనేది చంద్రబాబు కుట్ర. అక్కడున్న రైతుల పొట్టకొట్టి లేనిపోని భ్రమలు కల్పించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా చేశాడు కాబట్టే 2019  ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని, ఆయన కొడుకును అమరావతి ప్రాంత‌ ప్రజలు రిజక్ట్‌ చేశారు. 

కేంద్రీకృత అభివృద్ధి, రాష్ట్రం మోయలేని బరువుపెట్టి, అరచేతిలో వైకుంఠం చూపించి, వర్చువల్‌ డ్రాయింగ్స్, గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెట్టలేం.. దానికి ప్రజల ఆమోదం లేదని ఆ రోజున తెలిసింది. 

సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకొని, మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని తలపెట్టి చట్టం చేసినప్పుడు.. దాని తరువాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా వికేంద్రీకరణకు అనుగుణంగా, సీఎం వైయస్‌ జగన్‌కు మద్దతుగా నిలిచారని తేటతెల్లమైంది. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు సాంకేతికపరమైన కారణాలు, వ్యవస్థల్లో చొరబడైనా ఏదో ఒక రకంగా చేయాలనే కుట్రలకు సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు గట్టి మొట్టికాయల్లాంటివి’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 
 

Back to Top