తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించి, పలు సేవా కార్యక్రమాలతో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపునిచ్చింది. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
13వ వసంతంలోకి..
2011 మార్చి 12వ తేదీన ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా వైయస్ జగన్ నాయకత్వంలో అవతరించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుని రేపు 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో గడచిన 12 ఏళ్లలో ఎన్నో సవాళ్లను అధిగమించి, సంపూర్ణ ప్రజా బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన దాదాపు అన్ని హామీలు అమలు చేయడమే కాక, చెప్పని హామీలతోపాటు, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నారు.