అమరావతి : నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై శుక్రవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసమైంది. ఈ ఘటనను వైయస్ఆర్‌సీపీ ముక్తకంఠంతో ఖండించింది. ఇప్పటికే జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూటమి ఆగడాలపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికెట్ వీఆర్‌ఓలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. వేములలో జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను, అనంతపురం జెడ్పీ చైర్‌పర్సన్, తదితరులు దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యయత్నం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని వారు డిమాండు చేశారు.