తాడేపల్లి: దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అయిన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యత అని, చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీశారని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. బీఆర్ నాయుడిపై ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా అతన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. టీటీడీ ల్యాబ్ తిరస్కరించిన క్వాలిటీ లేని నెయ్యి మళ్లీ అనుమతించడం, అదే విషయాన్ని సీబీఐ–సిట్ చార్జిషీట్లలో ప్రస్తావించడం ఆందోళనకరమన్నారు. తిరుమల లడ్డూపై రాజకీయ దుమారం రేపుతూ, ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానాలి. ఆలయాల పవిత్రత, భక్తుల నమ్మకం కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అంటూ హెచ్చరించారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? అంటూ నిలదీశారు. టీటీడీ పట్ల కూటమి ప్రభుత్వ తీరును వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఎండగట్టారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత, అత్యంత నిష్ఠతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ ఛైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ఠ కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు గారు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్ఠను మంటగలిపేలా వ్యవహరించారు. ఒక బాధిత మహిళ ఎన్నికలకు ముందే చంద్రబాబుగారికి లేఖ రాస్తూ, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పనితో ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబుగారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్నిరకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ ఛైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ఠను, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుగారికి భక్తీ లేదు, శ్రద్ధ అంతకన్నా లేదు, దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది. లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్రబాబుగారికి అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ బాగోలేదని ఈ చంద్రబాబుగారి హయాంలోనే టీటీడీ ల్యాబ్ తిప్పి పంపినా, మళ్లీ అవే క్వాలిటీలేని నెయ్యి ట్యాంకర్లు, ఆయన హయాంలోనే వేరేవారిపేరిట తిరిగి టీటీడీకి రావడం, ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం, అక్కడ నుంచి తిరుమల లడ్డూ తయారీలో వాడడం, ఇదే విషయాన్ని సీబీఐ-సిట్ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్ ఛార్జిషీటు 44వ పేజీలోనూ ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుగారికి దేవుడి పట్ల భక్తీ లేదు, ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. ఈ రకంగా చంద్రబాబుగారు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నాడు. మరోవైపు 2014-19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278- రూ.330. 2019-24 మధ్య కూడా నెయ్యి సగటు రేటుకూడా దాదాపుగా అంతే. చంద్రబాబుగారు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇందాపూర్ డెయిరీకి, కిలో నెయ్యి రూ.658లకు, 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు, శ్రద్ధ లేదు, నిష్ఠ లేదు, నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.