తాడేపల్లి: విజయదశమి పండుగ, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైయస్ఆర్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు, వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమూరు చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా విజయదశమి పండుగను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ చిత్రపటం వద్ద పూజలు నిర్వహించిన పార్టీ నాయకులు అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేకుని కొనియాడారు. స్వాతంత్ర్యానికి పూర్వం కన్నా దారుణమైన పరిస్థితులు కూటమి పాలనలో రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సాకారం చేయడానికి మాజీ సీఎం వైయస్ జగన్ పునాదులు వేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితోనే కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా వైయస్ఆర్‌సీపీ పాలనలో లబ్దిదారులందరికీ వైయస్ జగన్ సంక్షేమ పథకాలు అందేలా చూశారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఇంకా ఏమన్నారంటే... గాంధీజీ చూపించిన అహింసా మార్గం దేశానికి దిక్సూచి : ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అహింసా మార్గంలో శాంతిని నెలకొల్పవచ్చని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఆయన చూపిన మార్గం ప్రపంచానికి ఇప్పటికీ దిశానిర్దేశం చేస్తోంది. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ సైతం ఆయన చూపించిన అహింసా మార్గంలోనే ఎన్నో పోరాటాలు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైయస్ జగన్ ఉద్యమాలకు బాపూజీ చూపించిన శాంతి మార్గమే స్ఫూర్తి. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు గ్రామ సచివాలాలు, ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి నుంచే పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రజాస్వామ్య బద్దంగా పాలన అందించారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి అందించిన జై జవాన్ జైకిసాన్ నినాదం స్ఫూర్తితో విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అడుగడుగునా అండగా నిలిచారు. రైతు పక్షపాత ప్రభుత్వంగా ఐదేళ్ల తన పాలనలో వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కే దక్కుతుంది. రాజకీయ నాయకులు విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని తన జీవితం ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప నాయకులు లాల్ బహదూర్ శాస్త్రీ గారు. రాజకీయాల్లో వైయస్ జగన్ సైతం ఆయన చూపించిన మార్గంలోనే విలువలతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారు. అహింసను మించిన ఆయుధం లేదు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మహాత్మా గాంధీ చూపించిన అహింసా మార్గం పోరాడే ప్రతిఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటిన గోప్ప నాయకులు బాపూజీ. విలువలే శ్వాసగా పదవులను తృణప్రాయంగా వదిలేసిన గొప్ప నాయకులు మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రిగారు. ఆయనిచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదంతోనే గత ఐదేళ్లు వైయస్ఆర్‌సీపీ రైతుల పక్షాన పనిచేసింది. లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తితోనే విలువలకు కట్టుబడి రాజకీయాలు : మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ గ్రామ స్థాయి నుంచే ప్రజలకు సంక్షేమాన్ని చేరువ చేసిన గొప్ప విజనరీ వైయస్ జగన్. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు రాష్ట్రంలో పునాదులు వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కే దక్కుతుంది. శాంతి మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో మహాత్మా గాంధీ కీలకపాత్ర పోషించారు. నిజాయితీగా విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి స్ఫూర్తితోనే వైయస్ఆర్‌సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది.