గురుమూర్తి గెలుపు.. దేశమంతా మనవైపు చూసేలా ఉండాలి

నెల్లూరులో వైయస్‌ఆర్ సీపీ శ్రేణుల ఎన్నికల ప్రచారం

పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయణస్వామి, పెద్దిరెడ్డి

నెల్లూరు: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని చిత్తూరు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో పాటు.. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ ఇన్‌చార్జ్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యంత సమర్థుడైన ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ నిలిచారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా పరిపాలన చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పాలనలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అన్నివర్గాలకు అందుతున్నాయన్నారు. సంక్షేమ పరిపాలన అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారన్నారు. 

పేదవాడిని పార్లమెంట్‌కు పంపించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గొప్ప నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. గురుమూర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంలా భావిస్తూ అభివృద్ధి చేస్తున్నారన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఏనుగులా బలిశాడు కానీ, బుద్ధి, జ్ఞానం లేదని మండిపడ్డారు. 

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గురుమూర్తి 5 లక్షల మెజార్టీతో గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ తన 20 నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాలు 90 శాతం పైగా అమలు చేశారన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అభ్యర్థి గెలుపు దేశం మొత్తం తిరుపతి వైపు చూసేలా ఉండాలన్నారు. 

Back to Top