దిగజారిన కూటమి పాలన 

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు

పిన్నెల్లి సోద‌రుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

నెల్లూరు జిల్లా:  కూటమి ప్ర‌భుత్వ పాల‌న రోజు రోజుకు దిగజారిపోతుంద‌ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిలతో కలిసి మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలన రోజురోజుకీ దిగజారుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఆధారాలు లేని అక్రమ కేసుల్లో పిన్నెల్లి సోదరులను అన్యాయంగా జైలుకు పంపడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కక్షను ప్రదర్శిస్తోందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను నమ్మిన నాయకులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తోందన్నారు.

కూటమి పాలనలో ఫ్లెక్సీలు కట్టినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తున్నారని, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైళ్లకు పంపడమే ప్రభుత్వ లక్ష్యంగా మారిందని మండిపడ్డారు. ఇలాంటి దుష్ట రాజకీయాలకు పాల్పడుతున్న కూటమి నాయకులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పిన్నెల్లి సోదరులు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతో ధైర్యంగా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి కుటుంబాలకు వైయస్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపడం తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైయస్ఆర్‌  కాంగ్రెస్ పార్టీ నాయకులనే ఇరికించడం పరిపాటిగా మారిందన్నారు. అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి తెలుగుదేశం నాయకులు పడుతున్న ఆనందం ఎక్కువకాలం నిలబడదని హెచ్చరించారు. మహానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలను పూర్తిగా నిర్మూలించారని, నేడు కూటమి పాలనలో మళ్లీ తలెత్తుతున్న ఫ్యాక్షన్ రాజకీయాలకు చంద్రబాబు, లోకేశ్‌లే కారణమన్నారు. భవిష్యత్తులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, పిన్నెల్లి సోదరులు సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించి కోర్టులో లొంగిపోయారని గుర్తు చేశారు. కూటమి పాలనంతా అక్రమ కేసులు, అక్రమ నిబంధనలతో నిండిపోయిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై 16 అక్రమ కేసులు పెట్టి దుష్ట సంప్రదాయాన్ని ప్రారంభించారని ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై సీబీఐ విచారణ జరపాలంటూ గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఆయన ధైర్యానికి నిదర్శనమన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ప్రమేయం లేని కేసుల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముద్దాయిలుగా చిత్రీకరిస్తూ, ఒక కేసులోని ముద్దాయిలనే తాము సృష్టించిన మరో అక్రమ కేసులో సాక్ష్యాలుగా కోర్టుల ముందు ప్రవేశపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు రాచరిక పాలనను అవలంబిస్తూ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు. ఎన్ని దొంగ కేసులు పెట్టి, ఎన్నిసార్లు జైళ్లకు పంపినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి వచ్చి మరింత ఉత్సాహంతో చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తారని స్పష్టం చేశారు. జగన్ 2.0 పాలనలో అక్రమాలు, కక్షసాధింపులకు పాల్పడేవారు భయపడే పరిస్థితి తప్పక ఏర్పడుతుందని హెచ్చరించారు.

Back to Top