తాడేపల్లి: రాజధాని ప్రాంతంలో రైతు రామారావు మృతి అత్యంత విషాదకరమని వైయస్ఆర్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో ఇలాంటి రైతు రామారావులు ఇంకా ఎంతమంది బలైపోవాలంటూ ఆయన ప్రశ్నించారు. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే సుమారు 30 వేల మంది రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ భూములు, ఇళ్లు తీసుకుంటామని చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వకూడదనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భూమిని లాక్కుంటే రైతు ఎంత వేదన చెందుతాడో పాలకులకు అర్థం కావడంలేదని అన్నారు. రైతు రామారావు నుంచి భూమి, ఇల్లు మాత్రమే కాకుండా చివరకు ఆయన ప్రాణం కూడా తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఒక్క రైతు సమస్యనైనా పరిష్కరించారా అని నిలదీశారు. రైతుల కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా అని ప్రశ్నించారు. భూసమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు పాలనా పద్ధతి మార్చుకోవాలి రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొదట భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయలేని చంద్రబాబు మళ్లీ భూసేకరణ చేస్తామని ఎలా చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు తన పాలనా పద్ధతిని మార్చుకోవాలని, ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల జీవితాలను పూర్తిగా అగమ్యగోచరం చేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతులు కోరుతున్నారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ప్రాంతానికి వస్తున్నప్పటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం కావడం లేదని విమర్శించారు. ఇంకా ఎంతకాలం అబద్ధాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారని ప్రశ్నించారు. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వాలని, వెంటనే రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించాలని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.