అమ‌రావ‌తి రైతులకిచ్చిన వాగ్ధానాలు నెర‌వేర్చాలి

బూట‌కపు గ్రామ స‌భ‌ల‌తో ఇంకెంతో కాలం మాయచేస్తారు?

భూములిచ్చి పదేళ్లైనా రైతులకు దక్కని న్యాయం 

తీవ్ర ఆవేదనలో రాజధాని రైతాంగం

ఇప్పటికైనా రైతులకు వాస్తవాలు చెప్పాలి 

భూములతో పాటు ప్రాణాలు త్యాగం చేసినా పట్టించుకోని ప్రభుత్వం

ఆగ్రహం వ్యక్తం చేసిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త దొంతిరెడ్డి వేమారెడ్డి

తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త దొంతిరెడ్డి వేమారెడ్డి 

రాజధాని కోసం భూమిని, ఇంటినీ ఇచ్చిన రైతు రామారావు

ప్రత్యామ్నాయంగా వాగులో ప్లాట్ కేటాయించిన ప్రభుత్వం

ఆవేదనతోనే  గుండుపోటుతో మృతి చెందిన రామారావు

ప్రభుత్వ తీరుపై వేమారెడ్డి ఆక్షేపణ

ఏడాదిన్నరలో కూటమి అప్పు దాదాపు రూ.2.81 లక్షల కోట్లు

అయినా ప్రజలకిచ్చిన హామీలూ నెరవేర్చలేదు

అమరావతి రైతులకిచ్చిన వాగ్ధానాలు అమలుచేయలేదు

రైతులు ఉసురు తగిలితే ప్రభుత్వానికే మనుగడ ఉండదు

తక్షణమే రాజధాని రైతులకు న్యాయం చేయాలి  

 కూట‌మి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త దొంతిరెడ్డి వేమారెడ్డి

తాడేప‌ల్లి:  రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంలో విఫలమైన కూటమి సర్కారు... భూమిలిచ్చిన రైతులతో చెలగాటమాడుతోందని మంగళగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం బూట‌కపు గ్రామ స‌భ‌ల‌తో రామారావు వంటి రైతుల జీవితాల‌తో చెలగాటమాడుతోందని మండిప్డారు. అన్నం పెట్టే భూమిని, నీడనిచ్చే ఇంటిని, ఆఖ‌రుకి ప్రాణాన్ని కూడా రాజ‌ధాని కోసం త్యాగం చేసిన రైతు రామారావు కుటుంబానికి ఈ ప్ర‌భుత్వం వాగులో ప్లాటు కేటాయించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప‌దేళ్ల క్రితం రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతుల‌కు ఇప్ప‌టికీ ప్లాట్లు కేటాయించ‌కుండా మాయ‌మాట‌లు చెబుతున్న సీఎం చంద్ర‌బాబు.. మ‌ళ్లీ భూసేక‌ర‌ణ ఊసెత్తడంతో రైతుల్లో ఎన్నో అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని తేల్చి చెప్పారు. ఏడాదిన్న‌ర‌లోనే రూ. 2.81 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిన చంద్ర‌బాబు, ప్రజలకిచ్చిన హామీలతో పాటు  అమ‌రావ‌తి రైతులకిచ్చిన వాగ్ధానాల‌ను నెర‌వేర్చడంలోనూ ఎందుకు చిత్తశుద్ధి ప్రదర్శంచడంలేదని నిలదీశారు. ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు అమ‌రావ‌తి ప్రాంతమంతా నీట మునిగింద‌ని, హైవేను 50 మీట‌ర్లు తొల‌గిస్తే కానీ నీరు బ‌య‌ట‌కుపోని పరిస్థితి ఉన్నా.. చంద్ర‌బాబు మాత్రం అంత‌ర్జాతీయ రాజ‌ధాని అంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌డం సిగ్గుచేటన్నారు. రైతుల‌ను వంచించ‌డం ఇకపై సాధ్యం కాద‌ని, ఇప్ప‌టికైనా అమ‌రావ‌తిపై రైతుల‌కు వాస్త‌వం చెప్పాల‌ని దొంతిరెడ్డి వేమారెడ్డి డిమాండ్ చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

అమ‌రావ‌తి కోసం రైతు రామారావు ప్రాణ‌త్యాగం

రాజ‌ధాని నిర్మాణం కోసం త‌న పొలంతోపాటు ఇంటిని సైతం ఇస్తే ఫ‌లితంగా ప్ర‌భుత్వం త‌న‌కి వాగులో ఇంటి స్థ‌లం ఇచ్చింద‌ని, ఫలితంగా త‌న బ‌తుకు రోడ్డున ప‌డిన‌ట్ట‌యింద‌ని గ్రామ స‌భ‌లో ఆవేద‌న చెందుతూ దొండ‌పాటి రామారావు అనే రైతు గుండెపోటుతో మ‌ర‌ణించ‌డం బాధాక‌రం. మంత్రి నారాయ‌ణ చెప్ప‌డం వ‌ల్లే వాగులో ప్లాట్లు ఇచ్చారంటూ రైతు రామారావు మ‌ర‌ణించ‌డానికి కొద్ది క్ష‌ణాల ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అందరికీ సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌లోనే స్థలాలు ఇవ్వాలన్న రైతు.. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి.. ఆ రైతు కుప్పకూలిపోయారు. సాక్షాత్తు మంత్రి నారాయ‌ణ‌, ఎమ్మెల్యే శ్రావ‌న్‌కుమార్‌ల ముందే రామారావు కుప్ప‌కూలి చ‌నిపోయిన సంఘ‌ట‌నతో కూట‌మి పాల‌న కార‌ణంగా అమ‌రావ‌తి రైతులు ఇన్నాళ్లు మౌనంగా అనుభ‌విస్తున్న‌ ఆక్రంద‌నను బ‌హిర్గ‌తం చేసింది. రామారావు త‌న భూమిని, ఇంటిని ఆఖ‌రుకి ప్రాణాన్ని కూడా అమ‌రావ‌తి కోసం త్యాగం చేశాడు. ప్ర‌తిఫ‌లంగా కూట‌మి ప్ర‌భుత్వం ఆయ‌న‌కు వాగులో ప్లాటు కేటాయించి నిలువునా ముంచేసింది. ఇంత‌కన్నా దారుణం ఇంకోటి ఉంటుందా? అమ‌రావతి రైతులు గొంతెమ్మ కోర్కెలేవీ కోర‌డం లేదు. ఏవైతే వాగ్ధానాలు ఇచ్చారో అవే నెర‌వేర్చ‌మ‌ని అడుగుతున్నారు. 

భూములిచ్చి ప‌దేళ్లు దాటిపోయింది

అమ‌రావ‌తికి భూములిచ్చి దాదాపు ప‌దేళ్లు దాటిపోయినా ఇంత‌వ‌ర‌కు ప్లాట్లు ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌మ ప‌రిస్థితి ఏమ‌వుతుందో అర్థంకాక రైతులు స‌త‌మ‌తం అవుతున్నారు. ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు పండించుకుంటూ కుటుంబాల‌ను పోషించుకుంటున్న రైతుల నుంచి ప్ర‌భుత్వం ఆ పొలాల‌ను తీసుకుంది. వారికి ప్ర‌త్యామ్నాయంగా ప్లాట్లు రాక‌పోవ‌డంతో బ‌తుకుదెరువు కష్ట‌మైపోయింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో అద‌నంగా మ‌రో 30 వేల ఎక‌రాలకు పైగా భూసేక‌ర‌ణ చేస్తామ‌న్న ప్ర‌భుత్వం నిర్ణ‌యంతో రైతుల్లో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం అవుతున్నాయి. అమ‌రావ‌తి ప్ర‌పంచ రాజ‌ధానిగా ప్ర‌చారం చేసుకుంటున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. దాని కోసం భూములిచ్చిన రైతులకి చేసిన వాగ్ధానాల‌ను మాత్రం గాలికొదిలేశారు. ప్ర‌తి రైతుకీ భూమే జీవానాధారం. అలాంటి భూమినే లాక్కుని ప్ర‌త్యామ్నాయ మార్గం చూప‌కుండా ఏళ్ల‌కు ఏళ్లు సాగ‌దీస్తుంటే ఆ కుటుంబాలను ఎలా పోషించుకుంటార‌ని ప్ర‌భుత్వం ఆలోచించ‌డం లేదు. వ‌ర్షాల కార‌ణంగా నీరు బ‌య‌ట‌కు వెళ్లే మార్గం లేక అమ‌రావ‌తి ప్రాంత‌మంతా మునిగిపోయే వ‌ర‌కు ఈ ప్ర‌భుత్వం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించ‌లేదు. హైవేను 50 మీట‌ర్లు ప‌గ‌ల‌గొడితే గానీ నీరు బ‌య‌ట‌కుపోలేదు. 

రైతుల జీవితాల‌తో ఆడుకోవ‌డం ఆపాలి

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఏడాదిన్న‌ర‌లో దాదాపు రూ. 2.81 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకి అమ‌రావ‌తి కోసం భూములు త్యాగం చేసిన రైతుల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త లేదా?  ఆ అప్పుల్లో రూ. 10 వేల కోట్లు అమ‌రావ‌తి కోసం రైతుల‌కు ఇచ్చిన వాగ్ధానాల‌ను నెర‌వేర్చ‌డం కోసం వెచ్చించ‌లేరా? రైతు బిడ్డ‌ను అని చెప్పుకునే సీఎం చంద్ర‌బాబుకి రైతులు ఆవేద‌న ఎందుకు అర్థం కావడం లేదు? రైతుల ఉసురు తీసుకుంటే ప్ర‌భుత్వం మ‌నుగ‌డ సాగించ‌డం అసాధ్యం అనే విష‌యాన్ని మ‌ర్చిపోతే వారికే న‌ష్ట‌మ‌ని హెచ్చ‌రిస్తున్నాను. ఇప్ప‌టికైనా కూట‌మి ప్ర‌భుత్వం త‌క్ష‌ణం స్పందించి ముందుగా రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న రైతులంద‌రి క‌న్నీళ్లు తుడ‌వాలి. రైతుల‌కిచ్చిన వాగ్ధానాల‌ను నెర‌వేర్చాలి. అమ‌రావ‌తిపై రైతుల‌కు వాస్తవాలు చెప్పాలి. రైతు కుటుంబాల‌తో ఆట‌లాడుకోవ‌డం మానుకోవాలి. అబ‌ద్ధాల‌తో ఇంకా ఎంతోకాలం రైతుల‌ను మోసం చేయ‌లేర‌ని గుర్తుంచుకోవాలని వేమారెడ్డి తేల్చి చెప్పారు.  అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌లకు శాశ్వత ప‌రిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Back to Top