తాడేపల్లి: కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికను ధర్మబద్ధంగా నిర్వహించే ఛాన్స్ లేకపోవడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తున్నట్లు వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ నేతలు సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రభుత్వం ధర్మబద్ధంగా నిర్వహించే పరిస్థితి లేదు. అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వ తప్పుడు పోకడలను నిరసిస్తూ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నాం. పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటరు ఓటు వేసుకునే పరిస్థితి లేదు. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జులు ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాన్ని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారని, ఈ దుర్మార్గ వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగవు కాబట్టి ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు పేర్ని నాని వెల్లడించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోందని పేర్నినాని మండిపడ్డారు. విచారణ పేరుతో వేధిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని, మేం ఎప్పటి నుంచో ఈ విషయాన్నిచెబుతున్నామని తెలిపారు. టీడీపీ నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. చట్టాలు మీరి ప్రవర్తించడం సరికాదు. వక్రమార్గాలు రాజకీయాల్లో ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయం. ప్రజల జీవితాలను భ్రష్టుపట్టించే చర్యలు మానుకోవాలని పేర్ని నాని సూచించారు.