నారా లోకేష్‌ ఎన్టీఆర్‌ వారసుడు కాదు

ఎన్టీ రామారావును చంపిన వ్యక్తికి వారసుడు

రాజకీయాల కోసం తల్లి పేరును వాడుకోవడానికి సిగ్గులేదా..?

మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ 

విశాఖ వీరప్పన్, నిత్య తాగుబోతు అయ్యన్నపాత్రుడు

ఎప్పుడు అంతరించిపోతుందో తెలియని భయంతో టీడీపీ బతుకుతోంది

ఎన్టీఆర్, ఎర్ర‌న్నాయుడు, మాధవరెడ్డి, బాలయోగి, హరికృష్ణ మరణాల మీద అనుమానాలు ఉన్నాయి

వైయస్‌ఆర్‌ సీపీ అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

తాడేపల్లి: కుటుంబంలోని మహిళను రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు, లోకేష్‌లను నాయకులుగా రాష్ట్ర ప్రజలు ఎందుకు అంగీకరించాలని వైయస్‌ఆర్‌ సీపీ అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. పార్టీ అంతరించిపోతుందనే నిత్య భయంతో బతుకుతూ..  కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేక శవ రాజకీయాలతో లబ్ధిపొందాలనే నీచస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. చంద్రబాబు భార్య, లోకేష్‌ తల్లి నారా భువనేశ్వరిని వైయస్‌ఆర్‌ సీపీ ఏదో అన్నట్టుగా ప్రచారాలు చేసుకుంటున్నారని, నిజంగా లోకేష్‌కు తల్లి మీద ప్రేమ ఉండి ఉంటే ఆరోజున అసెంబ్లీలో, బయట చంద్రబాబు చేసిన రాజకీయానికి ఆయన్ను పక్కనపెట్టాలన్నారు. రాజకీయాల కోసం తల్లిని వాడుకుంటున్నారంటే.. లోకేష్‌కు కనీసం సిగ్గు, లజ్జ ఉందా..? అని ప్రశ్నించారు. 

విశాఖలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ సీపీ నారా భువనేశ్వరి గురించి ఏమీ మాట్లాడలేదని,  ఆవిడ పేరును రాజకీయాలకు వాడుకుంటూ, ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబు వెక్కి వెక్కి ఏడ్చి.. లోకేష్‌ బయటకు వచ్చిన ప్రతీసారి తల్లి పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నాడని ధ్వజమెత్తారు. మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీ వైయస్‌ఆర్‌ సీపీ అని, సీఎం వైయస్‌ జగన్‌ మెజార్టీ సంక్షేమ పథకాలు ఆడపడుచుల పేరు మీదనే అమలు చేస్తున్నారని గుర్తుచేశారు.

గుడివాడ అమర్‌నాథ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

నారా లోకేష్‌ ఎన్టీఆర్‌కు వారసుడు కాదు.. ఎన్టీఆర్‌ను చంపిన ఓ వ్యక్తికి వారసుడు అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. ఎన్టీఆర్‌ మరణానికి కారణం చంద్రబాబు.. ఆ వ్యక్తికి  వారసుడు లోకేష్‌. ఏరోజు అయినా మా తాత ఖర్జూరనాయుడు అని చెప్పుకున్నావా లోకేష్‌..? మీ తాత ఖర్జూరనాయుడు పేరు చెప్పుకోలేని వ్యక్తికి ఎన్టీఆర్‌ గురించి, సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే స్థాయి మీకు ఉందా..? 

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడితే దాన్ని కూడా సహించలేకపోతున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడని, ఎన్టీఆర్‌కు వారసులమని చెప్పుకునే మీరు ఏ జిల్లాకు అయినా ఆయన పేరు పెట్టాలనే ఆలోచన చేశారా..? పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్‌ పేరు ఒక జిల్లాకు పెడితే దాన్ని కూడా సహించలేకపోతున్నారు. 

రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్‌ రక్తపు మరకల మీద పెరిగిన నాయకుడు చంద్రబాబు. రాజకీయ బిక్ష పెట్టిన ఇందిరాగాంధీ పట్ల నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఎన్టీఆర్‌ చావుకు కారణం అయ్యాడు. రాజకీయంగా సహచరుడిగా ఉన్న మాధవరెడ్డి మరణం వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆరోపించాం. రాజకీయంగా తోడుగా నిలిచిన సొంత బావమరిది హరికృష్ణను మోసం చేశారు. లాల్‌జాన్‌ బాషా, హరికృష్ణ, ఎ్రరన్నాయుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మాధవరెడ్డి బాంబ్‌ బ్లాస్ట్‌లో చనిపోయారు. ఎన్టీఆర్‌ గుండెపోటుతో చనిపోయారు. వీరి మరణాలు చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి. విచారణ చేయాలనే ఆలోచన కలుగుతుంది. మంచి నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో హెలికాప్టర్‌ ప్రమాదంలో బాలయోగి చనిపోయారు. టీడీపీలో చంద్రబాబుతో సమకాలికంగా రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందనే నాయకులంతా ఏరకంగా అంతరించిపోయారనే సందర్భాలు చూశాం.

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకుంటే ఆయనకు అండగా  నిలవాలని లోకేష్‌ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నిత్య తాగుబోతు అయ్యన్నపాత్రుడు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాత్రయితే రెండు చుక్కలేద్దామా అని ఎదురుచూస్తాడు. విశాఖ వీరప్పన్‌గా పేరుగాంచిన అయ్యన్నపాత్రుడు.. గతంలో జరిగిన గంజాయి అక్రమ రవాణాలన్నింటికి ఆద్యుడు. అలాంటి వ్యక్తులు మాట్లాడిన మాటలకు అడ్డుకట్ట వేయకుండా సహకరించే టీడీపీ విధానాన్ని ప్రజలు చూస్తున్నారు. కచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారు. 

 

తాజా వీడియోలు

Back to Top