సంక్షేమ ప్ర‌భుత్వాన్ని స‌మైఖ్యంగా బ‌ల‌ప‌రుద్దాం

వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి 

ఆత్మ‌కూరు వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థిగా రేపు నామినేష‌న్ వేయ‌నున్న మేక‌పాటి విక్ర‌మ్‌రెడ్డి 

ఆత్మకూరు: గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక జరుగుతుంద‌ని కలలో కూడా అనుకోలేదని, ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితి వస్తుందని ఊహించలేదని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడేళ్లుగా సంక్షేమ పాల‌న అందిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని స‌మైఖ్యంగా బ‌ల‌ప‌రుద్దామ‌న్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి ఆత్మ‌కూరు నియోజకవర్గ స్థాయి పార్టీ  ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మూడుసార్లు ఎంపీగా జిల్లా ప్రజలు తనను గెలిపించారని, ఆత్మకూరు నుంచి దివంగ‌త మేక‌పాటి గౌతమ్‌రెడ్డికి రెండు సార్లు ఘన విజయం అందించారని ఈ రుణం తీర్చుకోలేనిదన్నారు.

ప్రస్తుతం ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ ఆశీస్సులతో విక్రమ్‌రెడ్డి పోటీ చేస్తున్నారని, ఆయన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. తమ కోడలు శ్రీకీర్తి గౌతమ్‌రెడ్డి పేరుతో ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారని, ఆ ఫౌండేషన్‌లో తామంతా సభ్యులమేనని, ప్రభుత్వం ద్వారా చేయలేని పనులను ఫౌండేషన్‌ ద్వారా ప్రజలకు సేవచేస్తామని అన్నారు.  

రేపు నామినేషన్‌  
2వ తేదీన మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేస్తార‌ని, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని మేక‌పాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం 9 నుంచి నిరాడంబరంగా ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులతో కలిసి వెళ్లి 11 గంటల సమయంలో నామినేషన్‌ దాఖలు చేస్తారన్నారు. 

Back to Top