నెల్లూరు జిల్లా: పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నెల్లూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూపై ఆధారరహిత ఆరోపణలు అన్నీ అసత్యమని సీబీఐ రిపోర్టు స్పష్టం చేసినప్పటికీ, ఇంకా కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తూ అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నెల్లూరు నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.శాసన మండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, ఇతర పార్టీ నాయకులతో కలిసి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు అధికారిక ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కావాలనే రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి, విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కోరామని తెలిపారు. రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి” అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూపై నిరాధారమైన ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంలో పనిచేసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వై.వి. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై నిందలు మోపే ప్రయత్నం చేశారని, అయితే సీబీఐ, సిట్ విచారణలు, అలాగే NDDB, NDRI రిపోర్టులు జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నిర్ధారించాయని గుర్తు చేశారు. నిజాలు బయటపడిన తరువాత కూడా అదే అసత్యాలను ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను నిందితులుగా చూపిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పూర్తిగా తప్పు అని అన్నారు. ఫ్లెక్సీలు తొలగించాలని కోరితే, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడమేనా? తప్పులను ప్రశ్నిస్తే చంపేస్తారా? అని తీవ్రంగా నిలదీశారు. ఆరు గంటలపాటు అంబటి రాంబాబు ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని, అలాగే జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని దుశ్చర్య అని విమర్శించారు. పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను కూటమి పాలనలో రావణకాష్టంలా రగిలిపోతున్న మరో బీహార్‌గా మార్చేస్తున్నారు అని మండిపడ్డారు. లడ్డూ వ్యవహారంలో డైవర్షన్ కోసమే ఈ దాడులకు తెగించారని, గతంలో గీతం యూనివర్సిటీ భూముల అప్పగింత వ్యవహారంలోనూ ఇదే తరహా డైవర్షన్ రాజకీయాలు జరిగాయని ఆరోపించారు. పోలీసులు పక్షపాత ధోరణి విడనాడాలని, అధికార పార్టీకి కొమ్ముకాయడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదని హితవు పలికారు. తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి, ఫ్లెక్సీలు ఎవరు కట్టారు, ఎవరు కట్టించారు, నిధులు ఎవరు సమకూర్చారు, ఎవరి ప్రోద్బలంతో జరిగిందో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులను కోరారు. ఎంతో ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడి భక్తులకు మనోవేదన కలిగించిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే అని స్పష్టం చేశారు.