పెట్రోల్‌ బాంబులతో దాడి అత్యంత దారుణం

రాష్ట్రంలో పూర్తిగా గాడి తప్పిన శాంతి భద్రతలు

మాజీ ఎమ్మెల్యే  ఎస్వీ మోహన్‌రెడ్డి ఆక్షేపణ

కర్నూలు:  రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, కూటమి నేతలు పెట్రోల్‌ బాంబులతో ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ నిలిచిపోయారని కర్నూలులో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:
    మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్‌ ఇళ్ల వద్ద  పోలీసుల ముందే రాళ్లు, కర్రలతో, పెట్రోల్‌ బాంబులతో టీడీపీ గుండాలు దాడులకు తెగబడ్డారు. వారిని అడ్డుకోలేక పోవడం దారుణం. అది పోలీసుల చేతకానితనమా? లేక అధికార పార్టీకి దాసోహం అయ్యారా? కొంతమంది వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది. ఇలాగే పరిస్థితులు కొనసాగితే శాంతిభద్రతలకే ప్రమాదం. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోతే రాష్ట్రంలో అరాచక పరిస్థితులు తలెత్తుతాయి. 
    ఇలాంటి దౌర్జన్యాలతో వైయస్సార్‌సీపీ భయపడుతుందని అనుకుంటే అది మీ భ్రమే. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ వాళ్లు మీ వెంట పడితే మిమ్మల్ని కాపాడేందుకు ఎవ్వరూ ఉండరు. లోకేష్‌ దేశం విడిచిపోతారు. పవన్‌కళ్యాణ్‌ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంటారు. ఈ రోజు మీరు చేసిన ప్రతి చర్య డిజిటల్‌ బుక్‌లో రికార్డు అవుతోంది. ఇది గుర్తు పెట్టుకోండి.    
    కనీసం ఇప్పుడైనా కేంద్రం రాష్ట్రంపై దృష్టి పెట్టాలి. ప్రధాని, కేంద్ర హోం శాఖ స్పందించి తక్షణమే రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని ఎస్వీ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Back to Top