మహానేత స్ఫూర్తితోనే సీఎం వైయస్‌ జగన్‌ పాలన

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం

తాడేపల్లి: పాలకుడు ఎలా ఉండాలో చూపించిన నాయకుడు మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సజ్జల రామకృష్ణారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహానేత వైయస్‌ఆర్‌ స్ఫూర్తితోనే సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారన్నారు. వైయస్‌ఆర్‌ ఆచరణల్లోంచి ఓ మహావృక్షం పెరిగిందన్నారు. తండ్రి వేసిన అడుగుకి పదడుగులు సీఎం వైయస్‌ జగన్‌ వేశారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను బలోపేతం చేస్తూ.. ఆయన అడుగులో అడుగు వేద్దామన్నారు.   

 సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒక మామూలు మనిషి నిబద్ధతతో, పట్టుదలతో, మంచి ఆలోచనలతో, గొప్ప మానవతావాదిగా పనిచేస్తే మహామనిషిగా ఎలా ఎదగవచ్చో నిరూపించిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి గారు అని అన్నారు. అన్ని వర్గాలను అభివృధ్ది పథంలోకి తీసుకువచ్చి తద్వారా రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లేలా వైయస్ రాజశేఖరరెడ్డి గారు పాలన సాగించారన్నారు. ఆయన అందించిన ప్రజారంజకపాలన అందరికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథ‌కాలు, మానవత్వంతో తీసుకున్న నిర్ణయాలు ఆయన పాలనకు వన్నె తెచ్చి ఆయన పాలనాకాలం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదిగా చరిత్రపుటల్లో నిలిచిపోయిందన్నారు.  రైతులు, ఉద్యోగులు, కార్మికులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు మేలు జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైయస్ రాజశేఖరరెడ్డి గారికి దక్కుతుందన్నారు.

 శ్రీ వైయస్ జగన్ ఆ తండ్రికి తగ్గ తనయుడుగానే కాకుండా, ఒక సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, సామ్యవాదిగా నిలుస్తున్నారని తెలిపారు. గతంలో ఎవరైనా మంచి పాలన అందిస్తే రామరాజ్యం అని చెప్పుకునే వాళ్లం.... ఆ తర్వాత డా. వైయస్ సువర్ణయుగం - రాజన్నరాజ్యంగా పేరు పొందింది. నేడు జగనన్నరాజ్యంగా మన ముందుకు తీసుకువచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ప్రజారంజకమైన పాలన అందిస్తున్నారన్నారు. ఈ పాలన ప్రజల జీవన విధానంలోనే మంచిమార్పు తీసుకువస్తోందన్నారు. 

ఆ మహానేత అడుగుజాడల్లోనే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. వైయస్ఆర్ గారి ఆశయాలకు శాశ్వత ముద్ర ఉండేలా శ్రీ వైయస్ జగన్ పాలన చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ కు అన్ని విధాలా అండదండలందిస్తూ, ఆయనను బలోపేతం చేసేలా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఇందుకోసం ప్రతిన పూనాలని వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను కోరారు.

ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సలహాదారులు శ్రీ చల్లా మధుసూధన్ రెడ్డి, నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి శ్రీ పండుగాయల రత్నాకర్, నవరత్నాల అమలు ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ శ్రీ నారాయణమూర్తి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top