తాడేపల్లి: రాష్ట్రంలో చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను ప్రభుత్వం వేధిస్తోందని పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై పోలీసులు బీఎన్ఎస్ 111 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. అయినా కూడా పోలీసులు సోషల్ మీడియా యాక్టివీస్ట్ లను భయభ్రాంతులకు గురిచేయాలనే కుట్రతోనే ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై మాత్రమే బీఎన్ఎస్ 111 సెక్షన్ ప్రయోగించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయని, కానీ ఎపిలోని పోలీసులు మాత్రం దీనిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాని ద్వజమెత్తారు. చట్టాలను ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్న వారిని న్యాయస్థానాల ముందు ముద్దాయిలుగా నిలబెడతామని స్పష్టం చేశారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మనోహర్‌రెడ్డి ఏమన్నారంటే.. - కేంద్ర ప్రభుత్వం 2024, జూలై 1 నుంచి ఐపీసీకి బదులుగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. - కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్ట్ లపై ఉక్కుపాదం మోపేందుకు గానూ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగించే బీఎన్ఎస్ 111 సెక్షన్ ను అక్రమంగా బనాయించి వేధిస్తున్నారు. - సాధారణంగా ఈ బీఎన్ఎస్ 111 సెక్షన్ ను మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ సరఫరా, కిడ్నాప్, దొంగతనాలు, దోపిడీలు, బలవంతంగా ఆస్తుల స్వాధీనం, సుపారీలు తీసుకుని హత్యలు చేయడం, ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, వ్యభిచార వృత్తిలోకి బలవంతంగా దించడం వంటి నేరాలకు పాల్పడే వారిపై ప్రయోగించడం జరుగుతుంది. - ఈ చట్టం రావడానికి కనీసం పదేళ్ల ముందు నుంచి నేరాలకు పాల్పడి ఉండి, కనీసం ఒకటి కన్నా ఎక్కువ కేసుల్లో కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులపైనే ఈ సెక్షన్ వాడాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అభంశుభం తెలియని సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించి ఎక్కువ కాలం జైళ్లలో నిర్భంధించే కుట్రలకు పాల్పడుతున్నారు. - విచ్చలవిడిగా ఈ సెక్షన్ కింద కేసులు పెట్టి ఇప్పటికే ఎంతోమంది వైయస్ఆర్ సిపి కార్యకర్తలను జైళ్లకు పంపారు. చట్టప్రకారం వ్యవహరించకుండా చేస్తున్న ఈ అక్రమ నిర్బంధాలు ఎక్కువ కాలం నిలబడవని ప్రభుత్వం, పోలీసులు తెలుసుకోవాలి. దీనిపై క్వాష్ పిటిషన్లు కూడా వేస్తున్నాం. - సోషల్ మీడియా కేసులకు బీఎన్ఎస్ 111 సెక్షన్ వర్తించదని కేరళ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. - ఇటీవల ఏపీ హైకోర్టులో జస్టిస్ రఘునందన్‌రావు, జస్టిస్ ఉమామహేశ్వరరావులతో కూడిన సైతం డివిజన్ బెంచ్ సైతం పప్పుల వెంకటరమణారెడ్డిపై బనాయించిన బీఎన్ఎస్ 111 సెక్షన్ చెల్లదని తమ తీర్పులో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో డివిజన్ బెంచ్ తప్పును ఎత్తిచూపడంతో పాటు మెజిస్ట్రేట్ కూడా యాంత్రికంగా పనిచేశారని చెప్పారు. - మరో సోషల్ మీడియా కేసు అయిన పీసల శివశంకర్‌రెడ్డి వర్సెస్ ఏపీ ప్రభుత్వం విషయంలోనూ జస్టిస్ హరినాథ్ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. - ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల గొంతు నొక్కేందుకే సోషల్ మీడియా కేసుల్లో బీఎన్ఎస్ 111 సెక్షన్ వర్తింపజేయడం కుదరదని తెలిసీ పోలీసులు కేసులు బనాయిస్తున్నారు. కార్యకర్తలను భయభ్రాంతులను గురిచేసి సాధ్యమైనంత వరకు వారిని జైల్లో మగ్గేలా చేసే కుట్రలో భాగంగానే ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారు. - ఇటీవల కొంతమంది మెజిస్ట్రేట్లు కూడా సోషల్ మీడియా కేసుల్లో బీఎన్ఎస్ 111 సెక్షన్ వర్తింపజేయడం కుదరదని తిరస్కరిస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. - ఈ సెక్షన్లు పెట్టిన అన్ని కేసుల్లోనూ క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం. ఈ కేసులు బనాయిస్తున్న అధికారులపైన కూడా న్యాయస్థానాల్లో పోరాడతాం. - భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు కల్పించిన స్వేచ్ఛను హరించే విధంగా అమాయక పౌరులను జైళ్లలో పెట్టడం ద్వారా వేధించాలని పోలీసులు, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. - అర్థరాత్రి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయించడాలు, నెంబర్లు లేని వాహనాల్లో మష్టీలో వచ్చి అపహరించడం, కుటుంబ సభ్యులకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకపోవడం, అరెస్టు చూపకుండా ఆచూకీ చెప్పకుండా వారిని వేధించడం, రోజుకో పోలీస్ స్టేషన్‌కి తిప్పడం, పది రోజుల పాటు తిప్పిన సందర్భాలున్నాయి. ఇప్పటికే ఎన్నో కేసుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసి కార్యకర్తల ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. - ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారందర్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రైవేట్ కేసులు వేసి వీటికి సంబంధం ఉన్న ప్రతి పోలీస్ అధికారిని కోర్టులో ముద్దాయిగా నిలబెడతాం. - మా దారిలోకి రాకపోతే ఏమైనా చేస్తామనే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. ఆఖరికి జడ్జిలపై నిఘా పెట్టే దారుణమైన పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. న్యాయవాదులుగా మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయవ్యవస్థ జోలికొస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం.