ఏలూరు: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మందా సాల్మన్ ఘటనను నిరసిస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏలూరులో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాత బస్‌స్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ రూపకర్త డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరిగింది. సాల్మన్ అంత్యక్రియల కోసం గ్రామానికి తీసుకువెళ్తున్న మృతదేహానికి, బంధువులకు, అలాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం, కూటమి నాయకులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, దళితులు, ప్రతిపక్ష కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్రంగా విమర్శించారు. సాల్మన్ హత్యకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుకపెయ్యి సుధీర్‌బాబు, జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్ ఆధ్వర్యం వహించగా, జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (జేపీ), నగర అధ్యక్షుడు గుడిదేసి శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నేరుసు చిరంజీవి, నగర మహిళా అధ్యక్షురాలు విజయనిర్మల, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు డింపుల్ జాబ్, నగర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు జె.వి.ఆర్ మాస్టర్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.