అన్న సీఎం అవుతాడని చెప్పండి

కొయ్యగూడెం సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
 
చంద్రబాబు పంచే డబ్బులకు మోసపోవద్దు

ప్రతి గ్రామంలో లంచాలు లేనిదే పని చేయలేదు

లంచాలు లేని సంక్షేమ పాలన అందిస్తానని మాట ఇస్తున్నా

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చెల్లించాల్సిన బాకీలు ఎగ్గొట్టారు

రైతన్నల కష్టాలు చూశా..బాధలు విన్నాను

రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం

ఏ రైతు చనిపోయినా రూ.7 లక్షల పరిహారం ఇస్తాం

పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి

మన ప్రభుత్వం వచ్చాక ఉచితంగా చదవిస్తామని చెప్పండి

 

కొయ్యలగూడెం: ఇరవై రోజులు ఓపికపడితే వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అవుతారని ప్రతి గ్రామంలో..ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించారు. 

  •  మండుటెండలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చూపుతున్నారు. ప్రేమానురాగాలు పంచుతున్నారు. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
  • 14 నెలలు దాదాపు 3648 కిలోమీటర్లు దేవుడి ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలతో నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో మీతోనే నడిచాను. మీ కష్టాలు విన్నాను. మీ బాధలు అర్థం చేసుకున్నాను. ఆ పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నాను. 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏ గ్రామం తీసుకున్నా కూడా చంద్రబాబు చేసిన పథకాలు ఏమిటీ? స్కీములు ఏంటి అని చూస్తే..మనకు కనిపించేది ఏంటో తెలుసా? చంద్రబాబు అధికారంలోకి రాగానే రేషన్‌కార్డులు తీసేశారు. పింఛన్లు తీసేశారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలను పక్కన పెట్టి జన్మభూమి కమిటీల పేరుతో  ఒక మాఫియాను తయారు చేశారు. ఈ మాఫియా చేసిందెంటో తెలుసా? గ్రామంలోని మట్టి నుంచి ప్రతి ఒక్కటి దోచేశారు. ప్రతి పనికి లంచం తీసుకున్నారు. జన్మభూమి కమిటీలు తీసుకున్న లంచాలు గురించి ప్రతి గ్రామంలో చెప్పారు. నేను విన్నాను. మరుగుదొడ్డికి లంచం రూ.1800 లంచం, చంద్రన్న బీమాకు లంచం, బర్త్‌ సర్టిఫికెట్‌కు, డేత్‌ సర్టిఫికెట్‌కు లంచం, పింఛన్‌ తీసుకోవాలన్నా లంచం..గ్రామ గ్రామానా లంచాల పాలన చూశాను. ప్రజల ఇ బ్బందులు విన్నాను..చూశాను. వారికి లంచాలు లేని సంక్షేమ పాలన అందించేందుకు నేనున్నానని మాటిస్తున్నాను. 
  •  జనాభాలో 50 శాతం ఉన్న మహిళల కష్టాలు విన్నాను. బాధలు విన్నాను. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో 2018 సెప్టెంబర్‌ నెలలో డ్వాక్రా రుణాలు మాఫీ చేశానని సన్మానాలు చేయించుకున్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండా చేసినట్లు సన్మానాలు చూశాం. ఎన్నికలకు చివరి మూడు నెలల ముందు ఓట్లు కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ఇచ్చిన రూ.10 వేల చెక్కుల గురించి కూడా అక్కచెల్లెమ్మలు చెప్పారు. ఈ చెక్కులు చెల్లడం లేదు. ఆ చెక్కుల విలువ రూ.6 వేల కోట్లు కూడా దాటలేదు. సున్నా వడ్డీకి ఇవ్వాల్సిన బకాయిలు ఎగురగొట్టిన సంగతి కూడా విన్నాను. చంద్రబాబును నమ్ముకొని ఆ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల కష్టాలు విన్నాను. ఇవాళ అదే బ్యాంకులు సున్నా వడ్డీలు ఇవ్వడం లేదని విన్నాను. మన ప్రభుత్వం రాగానే ఇదే పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు నేను చెబుతున్నాను. నీ బాధలు నేనున్నానని భరోసా ఇస్తున్నాను. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మ రుణాలు నాలుగు ధపాలుగా మాఫీ చేసి నేరుగా మీకే ఇస్తాం.
  •  రైతున్నల కష్టాలు చూశాను. నేను విన్నాను. ఆ రైతులకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను. పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్న రైతన్నలకు నేనున్నానని భరోసా ఇస్తున్నాను. ప్రతి ఏటా మే మాసంలో ప్రతి రైతు చేతిలో రూ.12500 ఇస్తామని చెబుతున్నాను. నాలుగేళ్లలో రూ.50 వేలు రైతన్న చేతిలో పెడతానని మాట ఇస్తున్నాను. వడ్డీలేని రుణాలు ఇప్పిస్తాం.బీమా సొమ్ము మేమే ఇస్తాం. పగటి పూట కరెంటు ఇస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్‌ రద్దు చేస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తామని చెబుతున్నాను. 
  •  ఇదే నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు రైతులు నా వద్దకు వచ్చింది గుర్తుంది. మన పంటకు రేటు ఉండదు. పక్కన తెలంగాణలో రేటు ఉంటుంది. పామాయిల్‌ పంటలను గమనించాను, పొగాకు రైతులకు ప్రతి ఏటా నష్టాలే. ప్రతి రైతుకు పంట చేతికి వచ్చేసరికి రేట్లు ఉండటం లేదు. ఆ ప్రతి రైతుకు ఇవాళ హామీ ఇ స్తున్నాను. గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాను. తుపాను వచ్చినా..కరువు వచ్చినా రైతును ఆదుకునేందుకు రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరీత్యాల నిధి ఏర్పాటు చేస్తాం. రైతులు పొరపాటున మరణించినా..ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల బాధలు విన్నాను. వారి ఆవేదన విన్నాను.  ఇటువంటి సంఘటనలు జరుగకూడదని దేవున్ని ప్రార్థిస్తూ..ఆ కుటుంబాలకు హామీ ఇస్తున్నాను..పరిహారం కింద రూ.7 లక్షలు డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాం. అసెంబ్లీలోనే చట్టం చేస్తాం. ఆ డబ్బులు రైతులకే చెందేలా చట్టం తెస్తాం. అప్పులవారికి సంబంధం ఉండదని చట్టం తెస్తాం. 
  •  పక్కనే పోలవరం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో ప్రతి సమస్య వచ్చినప్పుడు బాధితుల పక్షాన ప్రతి సందర్భంలో ధర్నా చేసింది వైయస్‌ జగన్‌ అని గర్వంగా చెబుతాను. భూములు కోల్పోయిన రైతుల బాధలు విన్నాను. ఆ రైతుకు హామీ ఇస్తున్నాను. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు..పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం. త్యాగం చేసిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.5 లక్షలు ఇస్తామని మాట ఇస్తున్నాను. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సరిపోవడం లేదని రైతులు బాధపడుతున్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రానికి వరప్రసాదిని అవుతుంది. ఈ ప్రాజెక్టు నత్తనడకనా సాగుతోంది. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. పోలవరాన్ని కేంద్రం కట్టిస్తానని చెబితే చంద్రబాబు తన స్వార్థం కోసం తీసుకున్నారు. వర్కులను నామినేషన్‌ పద్ధతిలో పంచుకొని దోచుకుంటున్నారు. యనమల వియ్యంకుడు కూడా సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారంటే ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. 2018 నాటికి పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఇవాళ నత్తనడకనా సాగిస్తోంది. చంద్రబాబుకు అధికారం  ఇస్తే పోలవరం ప్రాజెక్టు పునాధి గోడలు దాటడం లేదు. తన వైఫల్యాలను ప్రజలు ఎత్తి చూపుతున్నారని చంద్రబాబు రోజుకో సినిమా చూపిస్తున్నారు. గేట్లు ఎత్తినట్లు టెంకాయలు కొడుతూ రోజుకో కథ..రోజుకో సినిమా చూపిస్తున్నారు. ప్రాజెక్టు కట్టకముందే బీటలు పడుతోంది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ తప్ప మరెక్కడా ఉండదు. 
  •  ఎన్నికల వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు చేయని డ్రామా ఉండదు. మోసం ఉండదు. చంద్రబాబుకు తానా, తందానా అనే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయి. టీవీ5 వంటి అమ్ముడపోయిన మీడియా ఉంది. వీరు చేయనిదాని చేసినట్లు చెబుతారు. దొంగే దొంగ అంటారు. వాళ్లే హత్యలు చేయిస్తారు. వాళ్లే రాస్తారు. వాళ్లే విచారణ చేస్తారు. ఎన్నికల రోజు వచ్చే సరికి గొప్ప డ్రామాకు తెర లేపుతారు. గ్రామాలకు మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ప్రతి చేతిలోనూ రూ.3 వేలు డబ్బు పెడతారు. గ్రామాల్లో ఉన్న ప్రతి అక్క వద్దకు, అవ్వ దగ్గరకు వెళ్లండి. ప్రతి ఒక్కరికి చెప్పండి..అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు..అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న సీఎం అయిన తరువాత మన పిల్లలను బడికి పంపించినందుకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తారని చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. ఈ రోజు మన పిల్లలు  ఇంజినీరింగ్, డాక్టర్‌ చదువులు చదవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. 20 రోజులు ఓపిక పడితే అన్న సీఎం అవుతారు. మన పిల్లలు ఏం చదువులు చదువుతారో ఎన్ని లక్షలు ఖర్చు అయినా అన్న భరిస్తారని చెప్పండి. 
  •  చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని డ్వాక్రా సంఘాల మహిళలకు చెప్పండి. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఎంతైతే అప్పులు ఉంటాయో వాటన్నింటిని నేరుగా నాలుగు దఫాలుగా మీ చేతుల్లో పెడతారని చెప్పండి. బ్యాంకుల్లోకి గర్వంగా వెళ్లి రుణాలు తెచ్చుకుందామని చెప్పండి.
  •  45 ఏళ్ల వయసులో ఉన్న ప్రతి అక్క వద్దకు వెళ్లండి..అక్క చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దు..అన్న సీఎం అయ్యాక వైయస్‌ఆర్‌ చేయూత పథకం తెస్తారు. నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా ఇస్తారని చెప్పండి.
  • 20 రోజులు ఓపిక పడితే  అన్న సీఎం అవుతారు. ప్రతి ఏటా మే మాసంలో రూ.12500 ప్రతి రైతుకు ఇస్తారని చెప్పండి. 
  • అవ్వా తాతల వద్దకు వెళ్లండి. మూడు నెలలక్రితం పింఛన్‌ ఎంత వచ్చేదని అడగండి. వెయ్యి రూపాయలు వస్తుందని చెబుతారు. ఎన్నికలు రాకపోయి ఉంటే..జగన్‌ పింఛన్‌ రూ.2 వేలు ఇస్తామనకుంటే చంద్రబాబు రూ.2 వేలు ఇచ్చేవాడా? . చంద్రబాబు మోసాలకు మోసపోవద్దు..అన్న సీఎం అయ్యాక పింఛన్‌ రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్తారని చెప్పండి. నవరత్నాల్లో ప్రతి అంశం ప్రతి ఇంటికి చేర్చండి. 
  •  రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలన కంటే గొప్పగా చేస్తామని మాట ఇస్తున్నాను. వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలరాజు, ఎంపీగా శ్రీధర్‌ నిలబడ్డారు. వీరు మంచివారు..ఉత్సాహవంతులు..వైయస్‌ఆర్‌సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి దీవించాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.  
Back to Top