ముస్లింలకు అండగా వైయ‌స్‌ జగన్‌

 నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌  

నెల్లూరు: రాష్ట్రంలో ముస్లింలకు అండగా ఉండేది, వారి అభివృద్ధికి కృషి చేసేది వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైయ‌స్ఆర్‌ సీపీ మాత్రమేనని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. నగరంలోని 53, 54వ డివిజన్లకు చెందిన ముస్లిం, మైనార్టీ నాయకులు గురువారం రాత్రి వెంకటేశ్వరపురంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే అనిల్‌ పాల్గొని మాట్లాడారు. జగనన్న సీఎం అయ్యాక ముస్లింలకు అన్నివిధాలుగా అండగా ఉంటారన్నారు. పలువురు ముస్లిం నాయకులు మాట్లాడుతూ ఓట్ల కోసం ముస్లింలపై ప్రేమ నటించే తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మమని తేల్చి చెప్పారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరిన వారికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని ముస్లిం పెద్దలు హెచ్చరించారు. 2014 ఎన్నికల్లో 53, 54 డివిజన్లలో అనిల్‌కు మంచి మెజార్టీ ఇచ్చామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందన్నారు.  

 

Back to Top