వైయ‌స్ఆర్‌సీపీ మైనార్టీ నేత ఇంటిపై కూల్చివేత యత్నం

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేత అమాన్ ఇంటిని కూల్చివేయడానికి మున్సిపల్ అధికారులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటున్న అమాన్ ఇంటిని కూల్చేస్తామంటూ బెదిరింపులు చేస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గత ఆరేళ్లుగా రేకుల ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్న అమాన్‌కు చెందిన ఇంటిపై శుక్రవారం ఉదయం నుంచి అధికారుల వేధింపులు మొదలయ్యాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇంటికి ఉన్న నీటి కుళాయి, విద్యుత్ కనెక్షన్లను నిలిపివేయడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఈ క్రమంలో పోలీసు బందోబస్తుతో మున్సిపల్ కమిషనర్ ఇంటిని కూల్చివేయడానికి అక్కడికి చేరుకున్నారు. అయితే అమాన్ భార్య తన చిన్న పిల్లలతో సహా ఇంటి గేటుకు తాళాలు వేసుకుని ఇంట్లోనే ఉండిపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మైనార్టీ వర్గానికి చెందిన నేతను లక్ష్యంగా చేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు అన్యాయమని వారు విమర్శించారు. మహిళలు, చిన్నపిల్లలు ఉన్న ఇంటిపై బలవంతంగా కూల్చివేతకు ప్రయత్నించడం మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని కూల్చివేతను నిలిపివేయాలని, అమాన్ కుటుంబానికి భద్రత కల్పించాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది.  

Back to Top