చంద్రబాబు పెద్దన్నగా ఎలా ఉంటారు?

కుప్పం సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

చంద్రబాబు తన సొంత తమ్ముడినే చిన్నచూపు చూశారు

వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించారు 

ధర్మానికి, అధర్మానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి

పేద పిల్లల చదువుకు ఎన్ని లక్షలు ఖర్చైనా భరిస్తాం

డ్వాక్రా రుణాలను నాలుగు దఫాల్లో చేతికే ఇస్తాం

రైతులకు మే నెలలో పెట్టుబడి కింద రూ.12500 ఇస్తాం

నవరత్నాలతో ప్రజల ముఖంలో నవ్వు కనిపిస్తుందని నమ్ముతున్నా

చంద్రమౌళిని ఆశీర్వదించండి..ఆయనకు కేబినెట్‌లో స్థానం కూడా కల్పిస్తా

 

చిత్తూరు: చంద్రబాబు తన సొంత తమ్ముడినే చిన్న చూపు చూశారని, అలాంటిది రాష్ట్ర ప్రజలకు పెద్దన్నగా ఎలా ఉంటారని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌కు వెన్నుపొటు పొడిచిన వ్యక్తికి రాష్ట్ర ప్రజలు ఓ లెక్కా అని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చే సరికి ప్రలోభాలకు తెర లేపుతారని, ఎవరూ కూడా ఆయన్ను నమ్మొద్దని పిలుపునిచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమంగా బనాయించిన కేసులను అధికారంలోకి రాగానే ఉపసంహరిస్తానని మాట ఇచ్చారు. చంద్రమౌళిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే..మంత్రిని చేస్తానని, కుప్పం అభివృద్ధి బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.

 ఈ కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న అగచాట్లు చూసినప్పుడు రాష్ట్ర చరిత్రలోనే బహుశా ఇంత అన్యాయమైన మనిషి ప్రపంచంలోనే ఎవరూ ఉండరేమో 1978వ సంవత్సరం చంద్రబాబు తొలిసారి చంద్రగిరి నుంచి ఎన్నికయ్యారు. 2400 ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత చంద్రబాబు మంత్రి అయ్యాడు. మంత్రిగా ఉన్న మనిషి ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో 1983లో చంద్రబాబు 17200 ఓట్లతో ఓడిపోయాడు. ఎన్నికలు అయిపోయిన తరువాత కూతురును ఇచ్చిన మామ ఎన్టీఆర్‌ పక్కన చేరాడు. 1985లో పోటీ చేయలేదు. 1989లో చంద్రగిరిని వదిలేశాడు. అక్కడ గెలవడనే భయం పట్టుకొని ఆ నియోజకవర్గాన్ని వదిలేశాడు. కుప్పంలో ప్రజలను సులువుగా మోసం చేయవచ్చు అని బీసీలు ఎక్కువగా ఉన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. బీసీ ఎక్కువగా ఉన్న చోట బీసీలకే టికెట్‌ ఇవ్వాలని ఏ పార్టీ అయినా ఆలోచన చేస్తుంది. కానీ చంద్రబాబు బీసీలను కూడా వాడుకునేందుకు విడిచిపెట్టేందుకు బీసీలకు ఇవ్వాల్సిన సీటు ఏకంగా గుంజేసుకొని తానే నిలబడ్డాడు. ఆ తరువాత 30 సంవత్సరాల పాటు పాలన చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కానీ, ఇదే కుప్పంలో ఏం అభివృద్ధి జరగిందని ఒక్కసారి ఆలోచన చేయండి. 30 సంవత్సరాలు చంద్రబాబు బీసీ కాకపోయినా.. బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబుకే ఓట్లు వేశారు. 30 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశాడో ఆలోచన చేయండి. గణేష్‌పురం వద్ద పాలూరు నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఏ రోజూ చంద్రబాబు ముందుకు రాలేదు. ఈ పాలారు ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో పనులు జరగకపోతే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలారు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 

నాన్నగారు ఈ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభిస్తారో.. ప్రాజెక్టు వస్తే కుప్పం ప్రజలు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారని ఓట్లేసిన ప్రజలను కూడా మోసం చేశాడు. తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిసి వారితో కోర్టులో కేసు వేయించారు. ఈ కుట్ర పూరిత మనిషిని గమనించండి. ఆశ్చర్యమేంటంటే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సగటున చదువుకున్న వారు 2011 జనాభా ప్రకారం.. 67 శాతం మంది. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నియోజకవర్గంలో అక్షరాస్యత సగటున రాష్ట్ర యావరేజ్‌ కంటే 61.8 శాతం మాత్రమే. రాష్ట్రంలో చదువుకున్న వారి సంఖ్య 67 శాతం ఉంటే కుప్పంలో మాత్రం 61.8 మాత్రమే. చాలా గ్రామాల్లో ఇవాల్టికి ప్రాధమిక విద్యను కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 14 సంవత్సరాలు ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. కుప్పంలో ఒక్క డిగ్రీ కాలేజీ కూడా కట్టించలేకపోయాడు. కుప్పంలో కనీసం పాల్‌టెక్నిక్‌ కాలేజీ కూడా కట్టించలేకపోయాడు. డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీ వైయస్‌ఆర్‌ హయాంలోనే వచ్చింది. 

అక్షరాల చంద్రబాబు పాలనలో వేల మంది విద్యార్థులకు ఫీజురియంబర్స్‌మెంట్‌ అందక బెంగళూరుకు కూలీ పనులకు వెళ్తున్నారు. ఇదే నియోజకవర్గంలోనే గుడిపల్లెలో వైయస్‌ఆర్‌ హయాంలో అద్భుతమైన పథకాన్ని గుడిపల్లె నుంచే ప్రారంభించారు. కానీ అదే ఆరోగ్యశ్రీ పథకం ఎలా ఉంది.. కార్డు ఉన్నా ఏ మాత్రం లాభానికి రానివ్వకుండా చేశాడు. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వాళ్లు పరిస్థితి ఏమిటీ.. మందుకు వేలకు వేల రూపాయలు ఖర్చు అవుతున్నా.. ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక్క అడుగు అయినా ముందుకు వేసిందా.. గుండె, కేన్సర్‌ వంటి జబ్బుకు వైద్యం చేయించుకోవాలన్నా.. అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే కుప్పంలో పూలు బాగా సాగు చేస్తారు. బంతి పూలు, చామంతి పూలు, బంతి పూలు గిట్టుబాటు కావాలంటే కనీసం రూ. 20 ఉండాలి కేజీకి. చామంతికి కేజీ రూ. 30 ఉండాలి. కానీ ఇదే నియోజకవర్గంలో కిలో రూ. 1 పడిపోయి ఆ పూలను రోడ్డు మీద పడేసిన పరిస్థితులు చూశాం. ఇదే కుప్పంలో ప్రభుత్వం తరుపు నుంచి ఏదీ ఉండదు. కనీసం మార్కెట్‌ యార్డు కూడా లేదు. కుప్పంలో ప్రైవేట్‌ తరుఫున మార్కెట్‌ యార్డు కనిపిస్తుంది. ప్రైవేట్‌ తరుఫున మెడికల్‌ కాలేజీ కనిపిస్తుంది. చివరకు ఈ కుప్పం నియోజకవర్గంలో రైతులకు మేలు చేయడానికి కోల్డ్‌ స్టోరేజీ గిడ్డంగులు కూడా లేవంటే ఎంతటి దారుణంగా ప్రభుత్వం ఉందో ఆలోచన చేయాలి. 

పట్టుగూళ్లు బైఓల్టిన్‌ రకం కనీసం గతంలో కేజీ రూ. 650 వచ్చేది. అదే పట్టుగూళ్లు రూ. 2 వందలు రాని పరిస్థితి. బోర్లపై వ్యవసాయం ఎక్కువగా సాగవుతుంది. 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన చంద్రబాబు కనీసం తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేని అధ్వాన్నమైన పాలన చూస్తున్నాం. 9 సంవత్సరాలు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ పాలనలో కుప్పం నియోజకవర్గంలో కేవలం 18 వేల ఇళ్లు మాత్రమే కట్టించాడు. అదే వైయస్‌ఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత కుప్పం నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో అక్షరాల 43 వేల ఇళ్లులు కుప్పంలో కట్టించారు. మళ్లీ ఐదు సంవత్సరాలు చంద్రబాబు పాలన చూస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు కట్టించింది కేవలం 5,500 కట్టించాడు. ఒక్కసారి ఆలోచన చేయాలి. పేదవాడిపై వీళ్లకు ఉన్న ప్రేమ ఆలోచన చేయండి. కేవలం ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని మనల్ని వాడుకోవడానికి మాత్రమే చూస్తున్నారు. మంచి చేయాలనే ఆలోచన ఈ పాలకులకు లేదని ఆలోచన చేయండి. 

ఇదే కుప్పం నియోజకవర్గంలో కొన్ని నెలల పాటు సెక్షన్‌ 30 అమలులోకి తీసుకొచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేశారు. తప్పుడు కేసులు బనాయించిన పరిస్థితి చూశాం. ఆ తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న ప్రతి కార్యకర్తకు, ప్రతి స్నేహితుడికి మాటిస్తున్నా.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తప్పుడు కేసులన్నీ పూర్తిగా ఉపసంహరిస్తామని హామీ ఇస్తున్నా.. ఇదే కుప్పం నియోజకవర్గంలో పథకాల అమలులో పక్షపాతం, ఉపాధి హామీ పనుల్లో తీవ్ర అవినీతి, కుప్పం మేజర్‌ పంచాయతీలో కూడా కోట్ల రూపాయల గోల్‌మాల్‌ జరుగుతుంది. ఇదే కుప్పం నియోజకవర్గ పరిస్ధితిని ఒక్కసారి గమనించమని కోరుతున్నా.. ఐదేళ్ల పాలన చంద్రబాబు అన్యాయం చేశాడని రాష్ట్ర ప్రజలు మొత్తం అంటున్నారు. చంద్రబాబు పాలనలో అన్యాయం చేశాడు. మోసపోయామని అంటున్నారు. ఇక్కడి కుప్పం ప్రజలు తమకే అన్యాయం జరిగిందని రైతులు, మహిళలు, నిరుద్యోగులు, బీసీలు, ఎస్సీలు అంటున్నారు. 

చంద్రబాబు తన సొంత తమ్ముడునే చిన్న చూపు చూసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పెద్ద అన్నగా ఉంటానంటే ఈ అన్న వల్ల ఏం ప్రయోజనం అని కుప్పం ప్రజలు అడుగుతున్నారు. చంద్రబాబు తల్లికి నలుగురు సంతానం. చంద్రబాబు అందులో పెద్ద కుమారుడు.. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత కుటుంబంలో మహిళలకు కూడా సమాన హక్కు కల్పిస్తూ చట్టం తీసుకొచ్చారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్దకొడుకు తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని 5 ఎకరాల స్థలం, జూబ్లీహిల్స్‌లోని ఒక ఇల్లు చెల్లెమ్మలు, తమ్ముడికి ఎవరికీ ఇవ్వలేదు. తన కొడుకు నారా లోకేష్‌కు రాయించిపెట్టాడు. ఆస్తి దగ్గరకు వచ్చే సరికి సొంత తమ్ముడు, అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచిన ఈ వ్యక్తి రాష్ట్ర ప్రజలకు అన్నగా, పెద్ద కొడుకుగా ఉంటానంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటని అడుగుతున్నా.. తన అన్నే తనకు అన్యాయం చేశాడని చంద్రబాబు తమ్ముడు రాంమూర్తి నాయుడు వందల సార్లు పబ్లిక్‌గా చెప్పారు. ఆయన ఇప్పుడు మనోవేదనకు గురై ఎక్కడ ఉన్నాడో.. ఎలా ఉన్నాడో.. ఎందుకు అలా ఉన్నాడో పాపం.. చంద్రబాబు తన సొంత తమ్ముడిని ఏ స్థాయికి తీసుకువచ్చాడో ఆలోచించండి. తన సొంత అక్కచెల్లెమ్మలకే న్యాయం చేయలేని చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు గత ఎన్నికల్లో బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి ఇప్పిస్తానన్నాడు. బంగారం రుణాలు మాఫీ అన్నాడు. పొదుపు సంఘాల రుణాల మాఫీపై మొదటి సంతకం అని ఓట్లు వేయించుకున్నాడు. కుప్పంతో సహా అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అక్కచెల్లెమ్మలను మోసం చేసిన ఘనత ఈ అన్నకే దక్కుతుంది. 

పసుపు – కుంకుమ పేరుతో ఎన్నికలకు ముందు మనందరికీ కొత్త సినిమా చూపిస్తున్నాడు. సొంత మామ ఎన్టీఆర్‌ పెట్టుకున్న పార్టీలో చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవిని లాక్కొని, పార్టీని లాక్కొని, జెండాను లాక్కొని, గుర్తును లాక్కొని, ఆయన పెట్టుకున్న ట్రస్టును కూడా లాక్కొన్న చంద్రబాబు లాంటి వ్యక్తిని నమ్మొచ్చా.. సొంత బావమరిది హరికృష్ణ చనిపోయాడానే బాధ కూడా లేకుండా ఆయన శవం పక్కనే కేటీఆర్‌తో తెలంగాణ ఎన్నికల్లో పొత్తు కోసం మాట్లాడాడు. అది కుదరకపోవడంతో తెలంగాణను బూచీగా చూపించి ఎన్నికల్లో జనాన్ని రెచ్చగొడుతున్న ఈ రాజకీయాలు నీచ రాజకీయాలు, సిగ్గుమాలిన రాజకీయాలు. 

తన కుటుంబంలో పెద్ద కొడుకుగా, సొంత కుటుంబంలోనే అన్నగా, సొంత కుటుంబంలో అల్లుడిగా, సొంత కుటుంబంలో బావగా ఇన్ని మోసాలు, కుట్రలు చేసిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాడని ఎవరైనా అనుకుంటారా.. బీసీల సీటు కాజేసిన చంద్రబాబు.. గత ఎన్నికల్లో కుప్పంలో కూడా గెలవడని తెలిసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుకూల ఓట్లను తీసివేయించాడు.. ఈ ఎన్నికల్లో కూడా అదే పనిచేశాడు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2014 మేనిఫెస్టోలో బీసీలకు 119 హామీలు ఇచ్చాడు. వాటిల్లో ఒక్కటైనా అమలు చేశాడా అని అడుగుతున్నా.. చివరకు ఆ ఎన్నికల మేనిఫెస్టో కోసం తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లో కనిపించకుండా మాయం చేశాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఇలాంటి మోసగాడు. అన్యాయస్తుడు పాలన చేస్తున్నాడు. మీ అందరికీ ఇక్కడి నుంచి బీసీ కులానికి చెందిన వ్యక్తి, ఐఏఎస్‌ అధికారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రమౌళి అన్నను నిలబెడుతున్నా.. చంద్రమౌళి అన్నను గెలిపించండి.. ఆయనకు తోడుగా ఉండండి.. మంత్రిని చేస్తా. 

చంద్రబాబు చేస్తున్న కుట్రలు, మోసాలు చూడండి. గత 20 రోజులుగా మనకు కనిపిస్తున్నాయి.. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి కుట్రలు తారాస్థాయికి చేరాయి. ఉన్నది లేనట్లుగా, లేనది ఉన్నట్లుగా చూపిస్తున్నారు. చంద్రబాబు పాలనపై చర్చ జరగకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చర్చ జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా రావని బాబు భయపడుతున్నాడు. చంద్రబాబు తన ఎల్లో మీడియాను ఉపయోగించి రోజుకో పుకారు పుట్టిస్తున్నాడు. ప్రజలను మభ్యపెట్టేందుకు వేరే అంశాలపై చర్చ జరిగేట్లుగా చేస్తున్నాడు. ఇవాళ జరుగుతున్న యుద్ధం.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతుందని మర్చిపోవద్దు. చంద్రబాబుతో ఒక్కరితోనే కాదు మన యుద్ధం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో యుద్ధం చేస్తున్నామని మర్చిపోవద్దు. 20 రోజులుగామీరంతా కుట్రలు చూస్తున్నారు. వారం రోజుల్లో ఎన్ని కుట్రలు జరుగుతాయో మీరే గమనించాలి. ఎన్నికల తేదీ వచ్చే సరికి గ్రామాలకు మూటల మూటల డబ్బులు పంపిస్తాడు. ప్రతి చేతిలో రూ. 3 వేలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు, వెన్నుపోటు పొడిచేందుకు కుట్ర చేస్తాడు. మీరంతా ప్రతి గ్రామం, ప్రతి వార్డుకు వెళ్లి ప్రతి అక్కను, ప్రతి చెల్లిని, ప్రతి అవ్వ, ప్రతి తాతను, ప్రతి అన్నను కలవాలి. 

అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న రూ. 15 వేలు ఇస్తాడని చెప్పండి. అక్కా వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదవాలన్నా.. సంవత్సరానికి ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైనే పలుకుతున్నాయి. మన పిల్లలను ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ చదివించాలంటే ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివించలేని పరిస్థితుల్లో ఉన్నామని ప్రతి అక్కకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు అన్న చదివిస్తాడని చెప్పండి. 

పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దని చెప్పండి. ఐదు సంవత్సరాలు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. పొదుపు సంఘాల రుణాల్లో ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని ప్రతి అక్కను అడగండి. రుణాలు మాఫీ కాకపోగా గతంలో సున్నావడ్డీకే వచ్చే రుణాలు పూర్తిగా ఎగరగొట్టాడని చెప్పండి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. చంద్రబాబు చేసే పసుపు – కుంకుమ డ్రామాకు అసలు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపిక పట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. పొదుపు సంఘాల రుణాలన్నీ అన్న నాలుగు దఫాలుగా చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

పేదరికంలో అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు చెప్పండి. అక్కా.. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలకు మోసపోవద్దు అక్కా.. వారం రోజులు ఓపికపట్టు అక్కా.. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చి ప్రతి అక్క చేతిలో రూ. 75 వేలు నాలుగు దఫాలుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. 

గ్రామాల్లోని ప్రతి రైతు దగ్గరకు వెళ్లి చెప్పండి. చంద్రబాబును నమ్మి ఓట్లు వేశాం. రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఆయన చేసిన రుణమాఫీ కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ప్రతి రైతన్నకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ఇచ్చే రూ. 3 వేలతో మోసపోవద్దు అన్నా.. ఆవరం రోజులు ఓపికపట్టు అన్న.. ఆ తరువాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ప్రతి రైతన్నకు మే మాసం వచ్చే సరికి పంట పెట్టుబడికి రూ. 12,500లు అందిస్తాడని, అక్షరాల పెట్టుబడుల కోసం రూ. 50 వేలు ప్రతి రైతన్నకు పెట్టుబడి కోసం అందిస్తాడని ప్రతి రైతుకు చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గిట్టుబాటు ధరలు ఇవ్వడమే కాదు..  గిట్టుబాటు ధరలకు కూడా గ్యారెంటీ ఇస్తాడని చెప్పండి. 

అవ్వాతాతల దగ్గరకు వెళ్లండి. రెండు నెలల కిందట పెన్షన్‌ ఎంత వచ్చేదని అడగండి.. పెన్షన్‌ వచ్చేది కాదని, లేకపోతే రూ. వెయ్యి మాత్రమే వచ్చేదని వేలెత్తి చూపిస్తుంది. ఎన్నికలు రాకపోయి ఉంటే జగనన్న రూ. 2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే ఈ చంద్రబాబు రూ. 2 వేలు ఇచ్చేవాడా అని ప్రతి అవ్వను అడగండి. ఆ అవ్వకు, ప్రతి తాతకు చెప్పండి అవ్వా చంద్రబాబు మోసాలను బలికావొద్దు.. వారం రోజులు ఓపిక పట్టు అవ్వా.. తరువాత మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు.. ప్రతి అవ్వాతాతలకు పెన్షన్‌ రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి. 

ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఇల్లు లేదు. చంద్రబాబు ఊరికి కనీసం 10 ఇళ్లులు కూడా కట్టించలేదు. వారం రోజులు ఓపిక పట్టు అన్నా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అక్షరాల 25 లక్షల ఇళ్లులు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యంలో ఇళ్లులు కట్టడం చూశాం. మళ్లీ అది ఆ రాజన్న బిడ్డ జగనన్నతోనే సాధ్యమని ఇల్లులేని ప్రతి నిరుపేదకు చెప్పండి.

నవరత్నాల్లోని ప్రతి అంశం ప్రతి కుటుంబంలోకి తీసుకొనిపోండి. నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో ఆనందం చూడవచ్చని గట్టిగానమ్ముతున్నా.. నవరత్నాలను ప్రతి గడప దగ్గరకు తీసుకువస్తానని మాటిస్తున్నా. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి మార్పురావాలి. రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానా చేస్తానని చెబితే.. మేనిఫెస్టోలో పెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత ఇచ్చిన హామీ అమలు చేయకపోతే పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లే పరిస్థితి తీసుకురావాలి. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలని కోరుతున్నారు. మీ అందరి చల్లని దీవెనలు చంద్రమౌళి అన్నపై ఉంచాలని కోరుతున్నా.. రెడ్డప్ప అన్నను ఎంపీ అభ్యర్థిగా నిలబెడుతున్నాను.. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఇద్దరు అన్నలపై ఉంచాలని పేరు పేరునా ప్రార్థిస్తున్నా.. మన పార్టీ గుర్తు ఫ్యాన్‌ అని ఎవరూ మర్చిపోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా. 

 

 

Back to Top