శివ‌రామిరెడ్డి మృతికి వైయ‌స్‌ జగన్‌ సంతాపం

వైయ‌స్ఆర్ జిల్లా: సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి(97) యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌ మృతి పట్ల వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం తెలిపారు. శివరామిరెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.  వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో శివ‌రామిరెడ్డి ఒకరు.

1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు. గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు. వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు.  

Back to Top