కుట్రలు, కుతంత్రాలతో కూట‌మి పాల‌న‌

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

ఎంపీ మిథున్‌రెడ్డితో మాజీ మంత్రులు ములాఖ‌త్‌

తూర్పుగోదావరి జిల్లా:   రాష్ట్రంలో కుట్ర‌లు, కుతంత్రాల‌తో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న సాగిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు విమ‌ర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున ములాఖ‌త్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..`చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేమున్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడు. దానికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయి. వైయస్ జగన్ ఇచ్చిన పథకాల కంటే అధికంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారు. వాటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు అమలు చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీలో అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరు. వైయస్ జగన్ ఎప్పటికే డిజిటల్ బుక్ గురించి చెప్పారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌కే కాదు, బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చు. అసలు మీ గురించి, నీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారో రహస్యంగా తెలుసుకోండి. మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు.  కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారు. ఇది కాదు పరిపాలన... తప్పుదారిలో వెళుతున్నామని మీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు` అని క‌న్న‌బాబు పేర్కొన్నారు.

రాష్ట్ర పగ్గాలను కొడుకు చేతిలో పెట్టాడు: మేరుగ నాగార్జున  
చంద్ర‌బాబు రాష్ట్ర ప‌గ్గాల‌ను త‌న కొడుకు నారా లోకేష్ చేతిలో పెట్టి న‌డిపిస్తున్నాడ‌ని మాజీ మంత్రి మేరుగు నాగార్జున విమ‌ర్శించారు. ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి బాధపడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తుంద‌న్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగుతుంద‌ని త‌ప్పుప‌ట్టారు. లేని లిక్కర్ కేసులు పెట్టి మా నాయకుల్ని అరెస్టు చేశారని ఆక్షేపించారు. సాధారణంగా కొండను తవ్వి ఎలుకను పట్టారు అంటార‌ని,  ఈ కేసులో ఎలుక కూడా లేద‌ని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరగలేద‌ని,  మద్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అంతులేని అవినీతి, అక్రమాలు జ‌రుగుతున్నాయని ధ్వ‌జ‌మెత్తారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చాలా తక్కువ ఆదాయం వస్తుంద‌ని గుర్తు చేశారు. వైయ‌స్ జ‌గ‌న్ పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిందని, కూట‌మి పాల‌న‌లో వ్యవసాయం, ఆరోగ్యం..ఇలా ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి కనిపించడం లేద‌న్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నార‌ని` మేరుగు నాగార్జున‌ ఫైర్ అయ్యారు.
 
 

Back to Top