అనంతపురం: వైయస్ఆర్‌సీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న స్థానిక యువనేత బుధవారం రాత్రి అనంతపురం జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు! అనంతపురం జిల్లా పామిడి మండలం కాలాపురం గ్రామ పొలిమేర ప్రాంతంలో రాత్రి ఈ ఘటన జరిగింది. వైయస్ఆర్‌సీపీకి చెందిన యువ నాయకుడు, జీ కొట్టాల గ్రామవాసి దేవన సతీష్‌రెడ్డి (34) పామిడిలో పని ముగించుకుని రాత్రి తన ద్విచక్రవాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన్ను గొంతు కోసి హతమార్చినట్లు భావిస్తున్నారు. బీటెక్ చదివి వ్యవసాయం చేస్తూ.. జీ కొట్టాలకు చెందిన రైతు దేవన కాశీ విశ్వనాథ్‌రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా మృతుడు సతీష్‌రెడ్డి చిన్న కుమారుడు. బీటెక్ చదివిన ఆయన ఇంటివద్ద వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. తన అన్న సుదర్శన్‌రెడ్డితో కలసి దాదాపు 30 ఎకరాల్లో చీనీతోట, వేరుశెనగ పంటలను సాగు చేస్తున్నారు. స్థానికంగా ఆ కుటుంబానికి మంచి పేరుంది. మృతుడి మరో సోదరుడు వెంకట నరసింహారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. వెనుక కూర్చుని గొంతు కోశారా? దేవన సతీష్‌రెడ్డిది ముమ్మాటికి హత్యేనని పామిడి మండల వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఎవరితోనూ విబేధాలు లేని వ్యక్తిని గొంతు కోసి దారుణంగా చంపడం పట్ల స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాచారం తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎవరో ఆయన ద్విచక్రవాహనం వెనుక కూర్చుని గొంతుకోసి హతమార్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమ వైపుగా వెళ్లాల్సిన వ్యక్తి కుడివైపున రోడ్డుపై హత్యగావించబడి ఉండడం... మృతుడి చెప్పుల్లో ఒకటి నడిరోడ్డుపై, మరొకటి కుడివైపు దూరంగా ద్విచక్రవాహనం దగ్గర ఉండడాన్ని బట్టి ఇది హత్యేనని పేర్కొంటున్నారు. పామిడి ఇన్‌ఛార్జ్ సీఐ రాజు, డాగ్ స్క్వాడ్ టీమ్‌తో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఇటీవలే వైయస్ జగన్‌ను కలిసి సంతోషంగా.. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం ఇటీవలే సతీష్‌రెడ్డిని రూరల్ బూత్ కన్వీనర్ ప్రెసిడెంట్‌గా నియమించింది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా ఉంటూ యువతను చైతన్యం చేస్తున్నారు. మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటీవలే కలిసి ఎంతో సంతోషంగా కనిపించిన సతీష్‌రెడ్డి దారుణ హత్యకు గురి కావడాన్ని వైయస్ఆర్‌సీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.