పులివెందుల: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యుడు, వైయస్ఆర్ సీపీ మాజీ ఎంపీ అవినాశ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణపై నమ్మకం లేదని, సీబీఐ విచారణ ఏర్పాటు చేసి కుట్ర కోణాన్ని తేల్చాలని ఆయన డిమాండు చేశారు. పులివెందుల ఆస్పత్రి వద్ద అవినాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా కుటుంబ పెద్ద దిక్కు, పెద్దనాన్న వైయస్ వివేకానందరెడ్డి మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఆయనది సహజ మరణం కాదు. పెద్దనాన్న మరణం పట్ల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన తలపై రెండు చోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. చేతి, మొహంపై కూడా గాయాలు కనబడుతున్నాయి. మాకున్న అనుమానాలను నివృత్తి చేయాల’ని కోరారు. ఎవరో దాడి చేస్తేనే వైయస్ వివేకానందరెడ్డి మరణించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని వైయస్ అవినాశ్ రెడ్డి తెలిపారు.ఆయన మృతిపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలో ఎంతటి వారున్న కఠినంగా శిక్షించాలన్నారు. నిన్నంతా మైదుకూరులో ప్రచారం నిర్వహించిన వైయస్ వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని గుర్తుచేశారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తెల్లవారే సరికి చనిపోవడంపై తమకు అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన మృతిపై వాస్తవాలు బయటకు రావాలని అన్నారు.