తిరుమల: ప్రతి ఏడాదీ టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా రెండేళ్ల తరువాత మాడ వీధుల్లో బ్రహ్మోత్సవ వాహనసేవలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో మెరుగైన సౌకర్యాలు కల్పించామని తెలిపారు. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి.
- టిటిడికి చెందిన 7,123 ఎకరాల్లో ఉన్న 960 ఆస్తుల తుది జాబితాను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాం. వీటి విలువ సుమారు రూ.85,705 కోట్లు. ప్రతి ఏడాదీ టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం సమర్పిస్తాం.
- ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు టిటిడి ఉద్యోగులకు ఇళ్లస్థలాలు కేటాయింపునకు ప్రభుత్వానికి రూ.60 కోట్లు చెల్లించి 300 ఎకరాలు కొనుగోలు చేశాం. భవిష్యత్ అవసరాల కోసం ఈ స్థలం పక్కనే ఉన్న మరో 132 ఎకరాల స్థలాన్ని రూ.25 కోట్లతో కొనుగోలు చేసేందుకు నిర్ణయించాం.
- శ్రీవారి బ్రహ్మోత్సవాల తరువాత తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శనం (ఎస్ఎస్‌డి) కౌంటర్లు ప్రారంభిస్తాం. 20 వేల వరకు టోకెన్లు జారీ చేస్తాం.
- శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేయాలని నిర్ణయం. బ్రహ్మోత్సవాల తరువాత ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయాన్ని అమలుచేస్తాం.
- తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయం. తద్వారా తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల తరువాత ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతాం.
- తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో గదులు లభించని భక్తుల కోసం అక్కడక్కడా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశాం.
- భక్తులకు అందించే శ్రీవారి నైవేద్య ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను ఎపి మార్క్‌ఫెడ్ మరియు రైతు సాధికార సంస్థ ద్వారా కొనుగోలు చేసేందుకు అంగీకారం. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను టెండర్ల ద్వారా కొనుగోలుకు నిర్ణయం.
- తిరుమలలోని గోవర్ధన సత్రాల వెనుక భాగంలో పిఏసి-5 నిర్మాణానికి రూ.98 కోట్లతో రివైజ్డ్ టెండర్లకు ఆమోదం. తద్వారా మరింత మంది భక్తులకు వసతి అందుబాటులోకి వస్తుంది.
- వకుళమాత ఆలయం నుండి పుదిపట్ల జూపార్క్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు. చెన్నై, బెంగళూరు నగరాల నుండి వచ్చే భక్తులకు ఈ రోడ్డు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందుకోసం స్థలం సేకరించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.
- తిరుమల నందకం విశ్రాంతి గృహంలో ఉన్న 340 గదుల్లో నూతన ఫర్నీచర్ ఏర్పాటుకు రూ.2.45 కోట్లు మంజూరుకు ఆమోదం.
- తిరుమలలో సామాన్య భక్తుల కోసం గదుల ఆధునీకరణ పనుల్లో భాగంగా గీజర్లు ఏర్పాటుచేయడమైనది. ఈ గీజర్ల కోసం అదనపు లోడు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు రూ.7.20 కోట్లతో టెండర్లకు ఆమోదం.
- నెల్లూరులో రెండు ఎకరాల స్థలంలో ఉన్న టిటిడి కల్యాణమండపం ఆధునీకరణ, శీతలీకరణ, చిన్న ఆలయ నిర్మాణ పనుల కోసం రూ.3 కోట్లు మంజూరు చేశాం.
- టిటిడిలోని క్లాస్-4 ఉద్యోగులకు నగదు బదులుగా యూనిఫారం క్లాత్ కొనుగోలుకు రూ.2.50 కోట్లు మంజూరు.
- ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాలలో అదనంగా తరగతి గదులు, హాస్టల్ గదులు నిర్మించేందుకు రూ.6.37 కోట్లు మంజూరు.
టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఇతర బోర్డు సభ్యులు, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం ఈ సమావేశంలో పాల్గొన్నారు.