గుంటూరు: పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం టి.అన్నారంలో టీడీపీ గుండాలు చేసిన హత్యా ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్‌సీపీకార్యకర్త, ఎన్నికల్లో పార్టీ పోలింగ్ బూత్ ఏజెంట్ వెంకట ప్రసాద్‌ను వైయస్ఆర్‌సీపీ నేతలు, నాయకులు పరామర్శించారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లా అనుబంధ విభాగాల ఇంఛార్జ్ షేక్ మస్తాన్ వలి, పార్టీ తాడికొండ నియోజకవర్గం ఇంఛార్జ్ వనమా మాల వజ్రపుబాబు, పొన్నూరు నియోజకవర్గం ఇంఛార్జ్ అంబటి మురళీకృష్ణ, పార్టీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, పార్టీ గుంటూరు సిటీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా తదితరులు గుంటూరు ఆస్పత్రిలో వెంకటప్రసాద్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న వెంకట ప్రసాద్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లో పార్టీ ఏజెంట్‌గా కూర్చుని, టీడీపీ రిగ్గింగ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దీంతో కక్ష కట్టిన స్థానిక టీడీపీ నాయకులు ఆయనపై పలుమార్లు దాడికి ప్రయత్నించారు. చివరకు శనివారం రాత్రి దాడి చేసి, తీవ్రంగా గాయపర్చారు. ఆయన చనిపోయాడని భావించి వదిలేసి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో క్షతగాత్రుడైన వెంకటప్రసాద్ గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో వెంకటప్రసాద్‌ను పరామర్శించిన అనంతరం వైయస్ఆర్‌సీపీ నేతలు, నాయకులు మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన ఒక బీసీ కార్యకర్తపై హత్యాయత్నం చేయడం అత్యంత హేయమని ఆక్షేపించారు. ఈ హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వారు, తమ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ దాడులు చేస్తోందని తెలిపారు. బీసీల ఎదుగుదలపై టీడీపీ నేతలు కక్ష కడుతున్నారన్న వారు, అసలు ఆ పార్టీ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా అని నిలదీశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వెంకటప్రసాద్‌ను చివరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయనివ్వకుండా ఎమ్మెల్యే ఆంజనేయులు అడ్డుపడ్డారని, ఇది కూటమి పాలనలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని మండిపడ్డారు. వెంకటప్రసాద్‌పై హత్యాయత్నం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన వైయస్ఆర్‌సీపీ నేతలు, నాయకులు.. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.