ఎంపీ మిథున్‌రెడ్డితో అనంత‌పురం జిల్లా నేత‌లు ములాఖ‌త్‌

తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో వైయస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డితో అనంత‌పురం జిల్లాకు చెందిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు,  మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అభూత కల్పనలతో లిక్కర్ స్కాం కేసు తయారు చేశారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. వైయ‌స్ జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు. 

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో జైలు, బెయిల్‌తోనే కాలం గడిచిపోయిందని.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే అధికంగా ప్రతిపక్షాలను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. `గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ జైలు వద్ద పవన్ కళ్యాణ్ వచ్చారు. అప్పుడు జైలు వద్ద పవన్ కళ్యాణ్ మాటలు కోటల దాటాయి. ఇప్పుడు ఆయన గడప కూడా దాటే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జైల్లో మిథున్ రెడ్డిని హింస పెడుతున్నారు. పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా సెంట్రల్ జైలు వద్ద భారీ గేడ్లు కట్టారు’ అంటూ గోరంట్ల మాధవ్‌ మండిపడ్డారు.

మాజీ ఎంపీ మార్గాని భరత్‌ మాట్లాడుతూ.. రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ అంటున్నారు.. మనీ ట్రైల్ ఎలా జరిగిందో 90 రోజులైనా నిరూపించలేకపోయారు. మద్యం డిస్టిలరీలు ఎవరికి ముడుపులు ఇచ్చారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రాబోయేది వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన హెచ్చరించారు.

 

Back to Top