ఉల్లిరైతుల గోడు కూటమి సర్కార్‌కు పట్టదా..?

రైతులంటేనే కూటమి ప్రభుత్వానికి చిన్నచూపు

మద్దతుధర లేక అల్లాడుతున్న రైతుల వ్యధ కనిపించడం లేదా. ?

తక్షణం ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పోరాడతాం

ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి

కర్నూలు లోని మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించి, ఉల్లి రైతులతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలని రైతులతో కలిసి ధర్నాగత ప్రభుత్వంలో క్వింటా ఉల్లి పంటకు రూ.3000 రేటు

నేడు క్వింటా రూ.100కి కూడా కొనేవారు లేరు

ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడటం లేదు

వైయస్ఆర్‌సీపీ పోరాడితే తప్ప సీఎం చంద్రబాబుకు చలనం రావడం లేదు

మండిపడ్డ ఎస్వీ మోహన్‌రెడ్డి

కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతుధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వం లోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్‌ యార్డ్‌ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు. వారం రోజులుగా మార్కెట్‌లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని,  కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైయస్ఆర్‌సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...

కర్నూలు మార్కెట్‌ యార్డ్‌లో ఉల్లిరైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు. వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్ గారు ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరుఫున వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం. రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైయస్ జగన్ నిలబడ్డారు. వైయస్ఆర్‌సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని  నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్‌కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.30 కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100 కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం.

Back to Top