అమరావతి : విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు టీడీపీ కీలక నాయకులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్, కుమార్తె రమాకుమారి, విశాఖ డైరీ బోర్డు సభ్యులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వైయస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అడారి ఆనంద్ పరాజయం పాలయ్యారు. స్వార్థం కోసం రాలేదు.. ఆనంద్ కుమార్, రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హామినిచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. స్వార్థం కోసం వైఎస్సార్‌సీపీలో చేరలేదు. మాపై నాన్న ఆశీస్సులు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైయస్ జగన్ పాలనపై నమ్మకం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, రైతు సంక్షేమ పథకాలు ఎంతో బాగున్నాయి. రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం తరపున పనిచేద్దామనే పార్టీలోకి వచ్చాం అన్నారు.