తాడేపల్లి: దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటంలో వైయస్ఆర్‌సీపీ ముందుంటుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ వి.విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని, వారి చిత్రపటాలకు పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ ముఖ్య నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆ మహానుభావుల త్యాగాలను స్మరించుకున్నారు. వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ఏమన్నారంటే... భారతదేశానికి స్వంతంత్రం సిద్దించి, నేడు 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం. ఆ త్యాగధనుల త్యాగాల్ని ఎన్నటికి మర్చిపోకూడదు. మనకు సిద్ధించిన స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద, ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంటుంది. మన సైన్యం అహర్నిశలు శ్రమిస్తూ, మనకోసం సరిహద్దుల్లో కాపలావుంటూ, మనల్ని ఎలా కాపాడుతుందో, అదేరకంగా ప్రతి పౌరుడు దేశ భక్తితో, దేశ సమగ్రతను, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలి. దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు, అలాగే రాష్ట్రంలోని ప్రధాన విపక్షం కూడా వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ, కొన్ని వేర్పాటువాద శక్తులను బలపర్చడం చాలా శోచనీయమైన విషయం. అటువంటి విపక్షాల కుయుక్తుల్ని, కుతంత్రాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా వైయస్ఆర్సీపీ, మన పార్టీ అధ్యక్షుడు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ గారు దేశ సమగ్రతకు, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తారు.. వైయస్ఆర్సీపీ దేశభక్తి కలిగిన పార్టీ, దేశం కోసం ఏదైనా చేయడానికి వైయస్ఆర్సీపీ ముందుంటుంది.. అసెంబ్లీలో కానీ, పార్లమెంట్ లో గానీ దేశ సమగ్రతను కాపాడే అంశాల్లో వైయస్ఆర్సీపీ ముందుండి పోరాడుతుంది.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్థిష్టమైన ఆలోచనతో పాటు ఒక ఎజెండాతో జరుపుకోవాలి. దేశవ్యాప్తంగా 200ఏళ్లకు పైగా స్వతంత్రం కోసం అనేక మంది మహానుభావులు, స్వతంత్ర సమరయోధులు ఎంతో నిబద్ధతతో ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేశారు. 200ఏళ్ల పోరాటం తర్వాత భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఏదైనా ఉద్యమం అనేది నెల, రెండు నెలలో జరపడం చూస్తుంటాం.. స్వతంత్ర ఉద్యమం 200 ఏళ్ల పాటు జరగడం అనేది చాలా అరుదైన సంఘటన. యావత్ భారతదేశ ప్రజానీకం అంతే ఏకమై 200 సంవత్సరాల పోరాటం చేసి, పట్టుదలతో స్వాతంత్య్రం సంపాదించుకున్నాము. మా దేశాన్ని మమ్మల్ని పరిపాలించుకోనివ్వండి అని సుదీర్ఘమైన పోరాటం చేశారు. ఏ దేశంలో కూడా ఇలాంటి పోరాటం జరగలేదు, ఇది చాలా అరుదైన సంఘటన. బ్రిటిష్ పాలన పోవాలని స్వతంత్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు మహాత్మా గాంధీ. ఆయనకున్న విజ్ఞత, పట్టుదలతో ఎంతోమంది శ్రేణుల్ని ప్రభావితం చేయగలిగాడు. గాంధీతో పాటు జవహర్ లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎందరో మహానుభావులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాక ముందుండి నడిపించారు. ఈ ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, శ్రీమతి పోతుల సునీత, కుంభా రవిబాబు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.