హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. షేర్ హోల్డర్ల అనుమతి లేకుండా టీవీ9 లోగోను రవిప్రకాశ్ అమ్మేయడంపై సాయిరెడ్డి స్పందించారు. ‘అప్పట్లో నట్వర్‌లాల్ అనే చీటర్ తాజ్‌మహల్‌నే అమ్మేశాడని తెలిసి విస్తుపోయాం. ఫోర్జరీ, నిధుల స్వాహా, షేర్ల అమ్మకాలు(బోగస్), టీవీ9 ట్రేడ్‌మార్క్, కాపీరైట్ అమ్మకాలు... రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్ మోసాలు నైజీరియన్ మోసగాళ్ళను తలపిస్తున్నాయి.’ అని వ్యాఖ్యానించారు. (టీవీ9 కాపీ రైట్స్, ట్రేడ్‌మార్క్‌లను కేవలం రూ.99వేలకే ‘మీడియా నెక్ట్స్ ఇండియా’ కంపెనీకి బదలాయించినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్డ్ డీడీలు అమలుచేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) డైరెక్టర్ పి.కౌశిక్‌రావు బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు అయింది.) చంద్రబాబుకు ఇది కనిపించలేదా? అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అయిదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహణపై చంద్రబాబు నాయుడు రాద్దాంతం చేయడంపై కూడా విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ‘ పశ్చిమ బెంగాల్‌లోని ఒక పోలింగ్ బూత్‌లో ఓటర్లకు బదులు ఓ మహిళా అధికారి తానే తృణమూల్ గుర్తు బటన్ నొక్కుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చంద్రబాబుకు కనిపించలేదా?. ఎన్నికల కమిషన్ మెత్తగా వ్యవహరించి ఉంటే తాను కూడా ఏపీలో అదే తరహా రిగ్గింగ్‌కు పాల్పడేవాడు కాదా?’ అని సూటిగా ప్రశ్నలు సంధించారు. కాగా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు.