బాబుది అగౌరవం.. బీసీలది ఆత్మ గౌరవం

బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ  

బీసీల తోకలు కత్తిరిస్తానన్న బాబు.. బీసీలు ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తున్న సీఎం వైయ‌స్ జగన్

బీసీ స‌ద‌స్సు విజ‌య‌వంతం కావడంతో టీడీపీలో వణుకు

 టీడీపీ హయాంలో పథకాలు అమలుకావాలంటే బీసీలు యాచించాల్సిన పరిస్థితి

 వైయ‌స్ జగన్ గారి హయాంలో తలెత్తుకుని బతికేలా డీబీటీ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోనే సొమ్ము

 స్థానిక సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చంద్రబాబే

  బీసీలంటే చంద్ర‌బాబుకు ద్వేషం, క‌క్ష‌..

 తన పాలన చూసి ఓటెయ్యండని ప్రజలను అడిగే ధైర్యం బాబుకు లేదు

  అందుకే కుట్ర రాజకీయాలు, పొత్తు రాజకీయాలు, శవ రాజకీయాలు

 మంత్రి చెల్లుబోయిన వేణు

తాడేప‌ల్లి:  బీసీల్లో వెనుకబాటుతనాన్ని పూర్తిగా రూపుమాపేందుకు, వారిని సమాజానికి వెన్నెముకగా నిలిపేందుకు ముఖ్యమంత్రి శ్రీ  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు చేపట్టిన చర్యలు, గత మూడున్నరేళ్ళ పరిపాలన సత్ఫలితాలనిస్తుంద‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. బలహీనవర్గాల స్థితిగ‌తుల‌ను గమనించి, వాటిపై పూర్తి అవగాహనతో, వారి సమస్యలను పరిష్కరించటమే వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సదస్సు ప్రధాన ఉద్దేశం. మా బీసీ సదస్సు పూర్తిగా ఫలవంతం అయింది. దాంతో ప్రతిపక్ష టీడీపీలో వణుకు మొదలై, నిన్నటి నుంచీ మాపైన అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారు. 

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి పరిపాలన మొదలవ్వడంతోనే తెలుగుదేశం పార్టీకి బీసీలు పూర్తిగా దూరమయ్యారు. ఆ పార్టీ ప్రముఖ నాయకులంతా భయాన్ని లోపల దాచుకుని, బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.  మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిగారు ఆ సభకు ఎందుకు వచ్చారని, బీసీల సభతో ఆయనకు ఏం సంబంధం అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసలు టీడీపీ నాయ‌కుల‌కు కనీస రాజకీయ పరిజ్ఞానం ఉందా? అని అడుగుతున్నాం.  ఏదైనా రాజకీయ పార్టీలో ప్రధాన కార్యదర్శి ముఖ్య  భూమిక పోషిస్తారు. ఆ సభ నిర్వహణలో తీసుకునే కీలక నిర్ణయాలను ప్రజలకు తెలియ‌జేయ‌డంతో పాటు, బీసీల్లో ఉన్న ప్రముఖులతో ఇష్టగోష్టి నిర్వహించి సీఎం గారి ఆలోచనా విధానం ఏ విధంగా ఉందో బీసీ సదస్సులో వివరించడం జరిగింది.

ఆ పాపం మీదే బాబూ..!
 రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాను.  అస‌లు రాష్ట్రంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసింది ఎవరు? జన్మభూమి కమిటీలు తెచ్చింది ఎవరు? జిల్లా కలెక్ట‌ర్‌ పెన్షన్‌ మంజూరు చేయాలంటే.. జన్మభూమి కమిటీకి చెందిన టీడీపీ వ్యక్తి సంతకం చేయాలనే దుస్థితికి పరి పాలనను తీసుకువెళ్లింది ఎవరు? గ్రామంలో విధులు నిర్వహించే గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు.. జన్మభూమి కమిటీల నుంచి అఫ్రూవల్‌ తీసుకోవాలని చెప్పింది ఎవరని సూటిగా అడుగుతున్నాం. పాలనలో పారదర్శకత లేకుండా,  తన తాబేదార్లను పెట్టుకుని ప్రజాప్రతినిధులను హింసించింది చంద్ర‌బాబు కాదా?

 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకముందే.. 2018లో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ఉంటే మన రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు అయ్యేవి. ఆ పాపం చంద్రబాబు నాయుడుది కాదా? మేము అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాం.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ప‌రిపాలనలో భాగస్వాముల‌ను చేస్తూ ముఖ్యమంత్రిగారు గొప్పగా పాలన చేస్తున్నారు. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారు. 
- అయితే 33శాతం, 24 శాతం అంటూ టీడీపీ ప్రజలను గందరగోళపరచాలని చూస్తుంది. అస‌లు ఆ పాపం టీడీపీది కాదా? పదేపదే ఒకే అబద్ధాన్ని చెబితే ప్రజలు నమ్ముతారనేది టీడీపీతో పాటు ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు విశ్వాసం.  టీడీపీ గోబెల్స్ ప్రచారాలను ప్రజలు నమ్మరు.
- సీఎం వైయ‌స్ జగన్‌ గారు అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తూ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆ క్రమంలో బీసీల వాటా తగ్గిందనుకుంటే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు మంత్రి వర్గం నుంచి నామినేటెడ్ పదవుల వరకు పదవులు కట్టబెట్టి,  పార్టీ తరపున బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించిన విషయం రాష్ట్రంలోని బీసీ సోదరులంతా గ‌మ‌నించారు. మీరు కూడా కళ్లు ఉండి గమనిస్తే మంచిదని హితవు పలుకుతున్నాను.
- 11 జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్లుగా  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన వారున్నారు. దాని గురించి మాట్లాడరేం? తెలుగుదేశం పార్టీ ఒక అబద్ధాన్ని పదేపదే మాట్లాడి నిజం చేయాలనే ప్రయత్నం చేస్తోంది.

బీసీలకు రూ. 82 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం
 బడ్జెట్‌ కేటాయింపులో రూ.33వేల కోట్లు మళ్లించారని టీడీపీ ఆరోపిస్తోంది. 2015-19 వరకూ బీసీల‌కు టీడీపీ సర్కార్‌ ఖర్చు చేసింది సుమారు రూ.19వేల కోట్లు మాత్రమే. అదే మా ప్రభుత్వ హయాంలో  ఈ మూడున్నరేళ్లలో బీసీలకు రూ.82,373.43 కోట్లు ఖ‌ర్చు చేశాము.. అంటే సుమారు రూ.60వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తే నిధులు మళ్లించామా? టీడీపీ అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం సరికాదు, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది.

  టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం..  ప్రజలు మీ హింస కమిటీ(జన్మభూమి)ల చుట్టూ  కాళ్ళు అరిగేలా తిరిగిన మాట వాస్తవం కాదా? టీడీపీ పాల‌న‌లో పథకాల ఎంపికలో పారదర్శకత లేదు. టీడీపీ హయాంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా రూ.7,948 కోట్లు ఖర్చు అయితే, మా ప్రభుత్వం రూ.58,697.89 కోట్లు ఖర్చు చేసింది. అంటే బీసీల ఉన్నతి,  విద్య కోసం అదనంగా సుమారుగా రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టాం.

బీసీల మీద బాబుకు ద్వేషం, కక్ష
  డా. బీ.ఆర్‌.అంబేద్కర్‌ చెప్పినట్లు విద్యే పెద్ద ఆస్తి. అదే మా ముఖ్యమంత్రిగారు అమలు చేస్తున్నారు. మేము ఆస్తులు ఇవ్వలేకపోయినా విద్యను అందిస్తున్నాం. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడితే మీ నాయకుడు చంద్రబాబు అడ్డుకోలేదా? బీసీల మీద ఆయనకు ద్వేషం, కక్ష కనిపిస్తోంది. బీసీల ఓట్లు కొల్లగొట్టి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏరోజు అయినా బీసీ కాలనీల్లో చదివే విద్యార్థుల‌ కోసం స్కూళ్లలో మౌలిక సదుపాయాల క‌ల్ప‌న మీద కానీ, బోధనన గురించి కానీ, వారికి మధ్యాహ్నం భోజనం ఏవిధంగా అందుతుందనే దానిపైన గానీ కనీసం ఆలోచన చేశారా? అని అడుగుతున్నాం.
- నేడు మా ప్ర‌భుత్వ‌ పాల‌న‌లో పేద‌ విద్యార్థుల ఉజ్వ‌ల భ‌విష్య‌త్ కోసం నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ స్కూళ్ళను అభివృద్ధి చేయడం ద‌గ్గ‌ర నుంచి గోరుముద్దు, అమ్మ ఒడి, విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన‌, విద్యా కానుక ఇలా ఏ ప‌థ‌కం చూసినా పేద విద్యార్థుల‌కు నాణ్య‌మైన విద్యతోపాటు, వారి బంగారు  భ‌విష్య‌త్ కు జ‌గ‌న్ గారు చేస్తున్న‌ కృషి, ఆయ‌న‌ చిత్త‌శుద్ది ఏమిటో ప్రజలు కళ్లారా చూస్తున్నారు. అయినా రోజు ఏదో విధంగా ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం టీడీపీకి, ఎల్లో మీడియాకు అలవాటుగా మారింది.

 వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా  1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే.. అందులో 84 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ‌ర్గాలకు ఇచ్చాం. వారిని శాశ్వత ప్రాతిపదికన నియమించిన ఘనత  ముఖ్యమంత్రి జగన్ గారిదే. మీ హయాంలో ఎందుకు చేయలేకపోయావు బాబూ? 

  ప్రజల యొక్క అవసరాలను తెలుసుకుని వారికి చేరువగా ఉండటమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కార్పొరేషన్ పదవుల్లో 129మంది బీసీ చైర్‌ పర్సన్లు ఉన్నారు. 484మంది డైరెక్టర్లు ఉంటే వారిలో సగం మంది బీసీలే. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. 672మంది డైరెక్టర్లు ఉన్నారు. వీళ్లంతా బీసీలే కదా.

బాబు హయాంలో యాచించాల్సిన పరిస్థితి..
 బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, తమ సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచడానికి కార్యక్రమాలు చేస్తున్నా.. కళ్లు ఉండి చూడలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. బాబు పాలనలో బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి ప్రభుత్వ సాయం కావాలంటే.. పదిమంది దగ్గర యాచించాల్సిన పరిస్థితి ఉండేది. వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సివచ్చేది.
- అదే నేడు సీఎం జ‌గ‌న్ గారి పాలనలో అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులకు నేరుగా డీబీటీ ద్వారా వారి ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతున్నాయి. బీసీల ఆత్మగౌరవాన్ని రక్షించింది మా ముఖ్యమంత్రి జగన్ గారే. అందుకే ఆయన బీసీలకు ఆత్మ బంధువు అయ్యారు.
- నేతన్న నేస్తం ద్వారా వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అవుతోంది. మత్స్యకారులు ప్రభుత్వం ఇచ్చే సాయంతో భరోసాగా బతుకుతున్నారు.. వీటి గురించి చంద్రబాబు మాట్లాడరు. 
- బీసీల కోసం అమలు చేసిన పథకాల ఖర్చు, చంద్రబాబు హయాంలో 2014–19 వరకూ ఇచ్చిన సబ్సిడీ రూ.1258 కోట్లు. బీసీలను ఎప్పుడూ  ఒకరి దగ్గరకు వెళ్లి అప్పు అడుక్కునేలా చేయడమే ఆయన ఆలోచన.  బీసీలు రుణగ్రస్తులు కావడానికి వీల్లేదని, నేరుగా వారి ఖాతాల్లోకి చేదోడు పథకం ద్వారా డబ్బులు జమ చేస్తోంది ముఖ్యమంత్రి జగన్ గారు. 

బాబు హయాంలో ఆదరణకు ఖర్చు చేసింది రూ. 337 కోట్లే
  టీడీపీ హయాంలోని ఆదరణ పథకంలో ఖర్చు చేసింది కేవలం రూ.377 కోట్లు. లబ్ధిదారుడికి వచ్చేది పదివేలు అయితే.. దానికోసం వందరోజులు తిరగాల్సి వచ్చేది. అధికారంలో ఉండగా, బీసీల గురించి చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడాడు. నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని చంద్ర‌బాబు అంటే.. వారి ఆత్మ గౌర‌వం పెంపొందించేలా జ‌గ‌న్ గారు జీవో నెంబ‌ర్ 50 తీసుకువ‌చ్చారు.. నాయిబ్రాహ్మ‌ణుల‌ను కులదూషణ చేస్తున్నారని, ఆత్మగౌరవం పెంపొందేలా జీవో నెంబర్‌ 50 తీసుకువచ్చి.. వారిని కించపరిస్తే.. చర్యలు తీసుకునేలా చట్టాన్నే తీసుకువచ్చారు. ఇది బీసీల ఆత్మగౌరవం పెంచడం కాదా? 

  మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పాలన చేయడమే. లబ్దిదారులకు నేరుగా డీబీటీ ద్వారా నగదు జమ చేస్తున్నాం. ఇంత చేస్తున్న మా ప్రభుత్వం మీద టీడీపీ  బీసీలు హత్యలకు గురవుతున్నారంటూ శవ రాజకీయాలు కూడా చేస్తోంది. బీసీలకు కావాల్సింది మీ శవ రాజకీయం కాదు. ఆత్మాభిమానంతో బతకడం. అది జగన్ మోహన్ రెడ్డిగారి  పరిపాలనలో జరుగుతుంది.  14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు.. నా పాలన చూసి ఓటు వేయాలని ప్రజలను ధైర్యంగా అడగలేరు. 

  పేదవారిని ఎప్పటికీ పేదవారిగానే ఉంచేందుకు, బీసీలను మరింతగా అణగదొక్కేందుకు టీడీపీ అధికారంలోకి రావాలా...? అని ప్రశ్నిస్తున్నాను. మీ దుష్ట పరిపాలన కోసం, అందరూ కలిసి రావాలంటూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను చంద్రబాబు అడుక్కుంటున్నాడు. మీ పాలనలో ప్రజా అవసరాలపై ఏనాడు అయినా దృష్టి పెట్టారా? వయసులో చిన్నవారైనా, ఎంతో పరిణితి చెందిన నాయకుడుగా, అన్ని వర్గాల సంక్షేమం కోసం జగన్‌ గారి సుపరిపాలనను చూసి... చంద్ర‌బాబు తట్టుకోలేకపోతున్నారు. పేదలకు ఆత్మీయ బంధువుగా మారిన సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి గారిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు.

  చంద్రబాబు నిస్సహాయత, చేతగానితనం, భయం అనేది ఆయన మాటల్లోనే స్పష్టం అవుతోంది. అందుకే ఏదో ఒకటి మాట్లాడి ప్రజల దృష్టిని మళ్లీంచాలని అనుకుంటున్నాడు. ఎలాగోలా అధికారం సాధించాలనే కాంక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారు. మూడున్నరేళ్ళలో డీబీటీ ద్వారా.. ఇప్పటికే రూ.2లక్షల కోట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం. పుట్టబోయే బిడ్డ నుంచి ముదుసలి వరకూ  గౌరవంగా బతుకుతున్నార‌నేది గడప గడపకు కార్యక్రమం ద్వారా వెల్లడ‌య్యింది. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది.

 

Back to Top