రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

వైయ‌స్ఆర్‌ జిల్లా: వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా కార్య‌క‌ర్త రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌ బాబు పరామర్శించారు . సీకే దిన్నె పోలీసు స్టేషన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ర‌వీంద్రారెడ్డి స‌తీమ‌ణి క‌ళ్యాణి మాట్లాడుతూ..అక్రమంగా తమను నిర్బంధించారని పేర్కొన్నారు. తన భర్త ఆచూకీ తెలుపమంటే పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారన్న కల్యాణి.. తన ఆరోగ్యం బాగా లేక పడిపోతే కనీసం డాక్టర్‌ను కూడా పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా అయితే హోం మంత్రి అనితదే బాధ్యత అని కల్యాణి అన్నారు.

వైయ‌స్ఆర్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..  ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(బుధవారం) ఉదయం రవీంద్రారెడ్డి భార్య కల్యాణి, సోదరుడు మల్లికార్జున రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను తీసుకెళ్లిన పోలీసులు.. వారిని తొలుత వేముల పోలీస్‌ స్టేషన్‌కి తరలించగా, అనంతరం చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఎస్పీ మాట్లాడాలి.. తీసుకురమ్మని చెప్తే తెచ్చామంటూ పోలీసులు తెలిపారు. చివరికి స్టేషన్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వారిని వదిలేశారు.

Back to Top