కృష్ణా జలాల కేటాయింపులకు లోబడే.. అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు

న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పంపిణీపై కృష్ణా వాటర్‌ డిస్‌ప్యూట్‌ ట్రైబ్యునల్‌-1 (కేడబ్ల్యూడిటి-1) జారీ చేసిన అవార్డుకు లోబడే కర్నాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించినట్లు జల శక్తి మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ కారణంగా నదీ పరివాహక ప్రాంతమైన దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో నీటి లభ్యతపై ఏ విధమైన ప్రభావం పడుతుందో అంచనా వేశారా..? అని రాజ్యసభలో సోమవారం వైయ‌స్ఆర్ సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 

రాయలసీమతోపాటు కృష్ణా బేసినల్‌లో వివిధ ప్రాంతాల్లో నీటి లభ్యతను పరిశీలించిన మీదటే కృష్ణా వాటర్‌ ట్రైబ్యునల్‌ -1 అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును 1976లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌లో ప్రతిపాదించిన కృష్ణా జలాల వినియోగం కర్నాటక రాష్ట్రానికి ట్రైబ్యునల్‌ -1 జరిపిన కేటాయింపుల పరిధిలోనే ఉంది. అందుకే సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌లపై ఏర్పాటైన అడ్వైజరీ కమిటీ అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ను ఆమోదించిందని కేంద్ర‌మంత్రి వివరించారు.

కేంద్ర జల సంఘం (సిడబ్ల్యూసి) మార్గదర్శకాల ప్రకారం ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకటించి ఉండి, దానికి అనుగుణంగా కేటాయించిన నదీ జలాల వినియోగం కోసం ప్రణాళికాబద్దమైన ప్రాజెక్ట్‌ చేపట్టినప్పుడు ఆ నదీ పరివాహక ప్రాంతంలోని ఇతర రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర జల సంఘం కోరబోదని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు. అయితే అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌పై 2021 డిసెంబర్‌లో జరిగిన హై పవర్డ్‌ స్టీరింగ్‌ కమిటీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర జల సంఘం ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక అధికారులతో పునఃవిచారణ జరిపింది. అనంతరం 2022 ఫిబ్రవరిలో జరిగిన పవర్డ్‌ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో కృష్ణా ట్రైబ్యునల్‌-1 అవార్డులో కర్నాటకకు చేసిన నదీ జలాల కేటాయింపులకు లోబడే అప్పర్‌ భద్ర ప్రాజెక్ట్‌ నిర్మిస్తున్నట్లు కేంద్ర జల సంఘం పునరుద్ఘాటించిందని జల శక్తి శాఖ సహాయ మంత్రి వివరించారు.

Back to Top