అనిశ్చిత వాతావరణానికి శుభం కార్డు పడింది

సినీ ప‌రిశ్ర‌మ మేలుకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు సంతృప్తినిచ్చాయి

చిన్న సినిమాలు విజయవంతంగా ఆడాలని ఐదు షోలకు ఆమోదం

ఏపీలో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాం

చర్చకు ఆహ్వానించిన సీఎం వైయస్‌ జగన్‌కు పరిశ్రమ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు 

సీఎంతో భేటీ అనంతరం మెగాస్టార్‌ చిరంజీవి

తాడేపల్లి: సినిమా పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సంతృప్తిపరిచాయని, సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన అనిశ్చిత వాతావరణానికి శుభం కార్డు పడిందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చకు ఆహ్వానించిన సీఎం వైయస్‌ జగన్‌కు పరిశ్రమ తరఫున చిరంజీవి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో సినీ పరిశ్రమ ప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళీ, అలీ, పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి, నిర్మాత నిరంజన్‌రెడ్డి సమావేశమయ్యారు. భేటీ అనంతరం సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో టాలీవుడ్‌ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ.. తక్కువ రేట్లకు వినోదం ప్రజలకు అందాలనే ఆశయానికి, ఇండస్ట్రీకి కూడా రెవెన్యూ రావాలనే దానిపై అన్ని రకాలుగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం అందరినీ సంతృప్తి పరిచిందన్నారు. అందుకు సీఎంకు పరిశ్రమ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చిన్న సినిమాల మీద సీఎం ప్రత్యేకంగా దృష్టిసారించి.. చిన్న సినిమాలు విజయవంతం కావాలి.. చిన్న నిర్మాతలు, దర్శకులు ఉంటే అందరికీ మంచి ఉపాధి ఉంటుందని దృష్టితో ఉంచుకొని ఐదు షోలకు ఆమోదం తెలపడం సంతోషకరమైన విషయమన్నారు. 

దేశంలో మన తెలుగు సినిమా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ కీర్తిస్తున్నారని,  పెద్ద బడ్జెట్‌తో సినిమాలు తీసే స్థాయికి మన తెలుగువారు రావడం, ఆ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో కీర్తి వస్తుందని, అలాంటి వాటికి ప్రత్యేక వెసులుబాటు చేయాలనే విషయంపై కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పడం అందరికీ సంతృప్తినిచ్చిందన్నారు.  

తెలంగాణలో ఎలా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందిందో అదే విధంగా ఏపీలో అభివృద్ధి చెందాలని, అందుకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పడం సంతోషమన్నారు. విశాఖను సినిమా హబ్‌గా తయారు చేస్తామని చెప్పారన్నారు. సీఎం చొరవతో ఎంతోమంది ఔత్సాహికులకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు, సినిమా ఇండస్ట్రీకి మేలు చేయడం కోసం  సినిమాటోగ్రఫీ మంత్రిగా పేర్ని నాని తీసుకున్న చొరవకు మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల మూడో వారంలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. 

 

Back to Top