అమరావతి రైతుల ముసుగులో బూట‌క‌పు యాత్ర‌

హోంమంత్రి తానేటి వనిత  

కొవ్వూరు: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల ధరలు ఎక్కడ తగ్గిపోతాయో, తమ వ్యాపారాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న స్వార్థంతోనే అమరావతి పేరుతో వారు పాదయాత్ర చేస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత విమర్శించారు. అమరావతి రైతుల యాత్ర ముసుగులో పచ్చమీడియా సహకారంతో ఒక బూటకపు యాత్ర చేస్తున్నారని.. కానీ, రాష్ట్రంలో ఎక్కడా ఈ యాత్రను ప్రజలు స్వాగతించడంలేదన్నారు. 
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. పచ్చమీడియాను అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి సానుభూతి పొందాలని టీడీపీ ఆరాటపడుతోందన్నారు. ప్రజల్లో ఏదో రకంగా అలజడి సృష్టించి గొడవలు పెట్టుకునేందుకు రెచ్చగొట్టడం.. తద్వారా లబ్ధిపొందాలనే టీడీపీ నేతలు పనిచేస్తున్నారని ఆరోపించారు.  

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో  ఆమోదించినట్టు గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్లడంతో అన్ని విధాలుగా నష్టపోయామని.. భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులు ఏర్పాటుచేస్తోందని వివరించారు.

Back to Top