మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో కూటమి సర్కార్ దగా..

మెరిట్ లిస్ట్ విడుదల చేయకుండా అభ్యర్ధులకే మెసేజ్‌లు..

టీచర్ పోస్ట్‌లను అమ్ముకునేందుకే కొత్త నిబందనలు..

మెరిట్‌ అభ్యర్ధుల నోట్లో మట్టి కొడుతున్న మంత్రి నారా లోకేష్..

మండిపడ్డ వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర 

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర

గతంలో డీఎస్సీ అభ్యర్ధుల మెరిట్ లిస్ట్ ప్రకటించేవారు..

రిజర్వేషన్ కం రోస్టర్ కింద జాబితాలను వెల్లడించేవారు..

పారదర్శకంగా టీచర్ పోస్ట్‌లను భర్తీ చేసేవారు..

ఈ విధానాలకు పాతరేస్తున్న కూటమి సర్కార్..

టెట్ మార్కుల సవరణలోనూ అనేక అనుమానాలు..

వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర ఆగ్రహం

తాడేపల్లి: రాష్ట్రంలో టీచర్ పోస్ట్‌లను భర్తీ చేసేందుకు నిర్వహించిన మెగా డీఎస్సీ ఫలితాల వెల్లడిలో అభ్యర్ధులను దగా చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైందని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్రలు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... డీఎస్సీ ఫలితాలు ప్రకటించే సందర్భంలో ప్రభుత్వం మెరిట్‌ లిస్ట్‌లను వెల్లడించకూడదనే నిర్ణయం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకతకు పాతర వేస్తూ, మెరిట్ అభ్యర్దుల నోట్లో మట్టి కొట్టేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తమకు కావాల్సిన వారికి టీచర్ పోస్ట్‌లను అమ్ముకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఇంకా వారేమన్నారంటే...

కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ నుంచి పరీక్ష నిర్వహణ వరకు విద్యాశాఖ అసమర్థత వల్ల అనేక తప్పిదాల చోటుచేసుకున్నాయి. మొత్తం 16,347 పోస్ట్‌లకు సంబంధించి 3.12 లక్షల మంది అభ్యర్ధులు డీఎస్సీ పరీక్ష రాశారు. ఈ పరీక్షా ఫలితాలను ప్రకటించే సందర్భంలో గతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్‌ను పరిగణలోకి తీసుకుని, అభ్యర్ధులకు వచ్చిన మార్కులను చూపుతూ మెరిట్ లిస్ట్‌లను విడుదల చేసేవారు. రాష్ట్రంలోని మొత్తం అభ్యర్ధులంతా ఆ మెరిట్ లిస్ట్‌లను పరిశీలించుకునేందుకు వీలు కల్పించేవారు. పోస్ట్‌ల భర్తీ విషయంలో పాదర్శకంగా జరిగేలా గతంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. కానీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ తల్లకిందులైంది. డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్ధుల మెరిట్ లిస్ట్‌ను కూడా ప్రకటిచేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదు. నేరుగా అభ్యర్దులకే మెసేజ్ పంపి, వారు టీచర్ పోస్ట్‌ల ప్రక్రియకు వచ్చేలా నిబంధనలను మార్చారు. దీనివల్ల ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయి, మెరిట్ లిస్ట్‌లో తాము ఏ స్థానంలో ఉన్నామో కూడా పరీక్ష రాసిన అభ్యర్ధులకు తెలియదు. గతంలో ఉన్న పారదర్శక విధానానికి ఎందుకు కూటమి ప్రభుత్వం పాతరేస్తోందని అభ్యర్ధులు ప్రశ్నిస్తున్నారు. టీచర్ పోస్ట్‌లను కూడా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకునేందుకు వీలుగా మెరిట్ లిస్ట్‌లను ప్రకటించకుండా, తమకు కావాల్సిన వారికే మెసేజ్‌లు పంపి, పోస్ట్‌లను అమ్ముకునేందుకు భారీ కుట్ర జరుగుతోందనే ఆందోళన అభ్యర్ధుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే డీఎస్సీ కీ లో పలు తప్పులు ఉన్నాయని, వాటిని సవరించాలని అభ్యర్ధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా స్పందన లేదు. దీనిపై కొందరు అభ్యర్ధులు కోర్ట్‌ను కూడా ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ లోగానే పోస్ట్‌లను గుట్టుచప్పుడు కాకుండా భర్తీ చేసేయాలనే తపనతో కూటమి ప్రభుత్వం అన్ని నిబంధనలకు నీళ్ళు వదిలి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే టెట్‌కు సంబంధించి మార్కుల సవరణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అనేక సందేహాలు వ్యకమవుతున్నాయి. టెట్‌లో వచ్చిన మార్కులతో డీఎస్సీలో ఇరవై మార్కులకు వెయిటేజీ ఉంది. డీఎస్పీ ఫలితాలు వెలువడే ముందు దాదాపు అరవై వేల మందికి టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇవ్వడం కూడా అభ్యర్ధుల్లో అనుమానాలు కలిగిస్తోంది. డీఎస్సీ అభ్యర్ధుల జీవితాలతో చెలగాటం ఆడే ఈ విధానాలకు తక్షనం స్వస్తి పాలకాలని వైయస్ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం.

Back to Top