నెల్లూరు: కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై వైయస్ఆర్‌సీపీ తరుఫున తన పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు సహించలేక అక్రమ కేసులు, తప్పుడు అరెస్ట్‌లు, జైళ్ళకు పంపడం ద్వారా వేధిస్తే భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజల కోసం నినదించే గళాలను నొక్కేయాలనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. ఎంతగా అణిచివేయాలని అనుకుంటే, అంతగా పైకి లేచి ఈ ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీస్తూనే ఉంటామని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని సాంప్రదాయాలను కూటమి ప్రభుత్వం పరిచయం చేస్తోంది. ఒకసారి జెడ్పీ చైర్మన్ గా, రెండుసార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తిని నెల్లూరు చరిత్రలో ఇన్నాళ్లు జైల్లో పెట్టడం ఇదే ప్రథమం. నా మీద ఆరు సోషల్ మీడియా కేసులు పెట్టారు. వాటి మీద ఏడు పీటీ వారెంట్లు వేశారు. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నన్ను విమర్శించిన వారి మీద ఏనాడూ కేసు పెట్టలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామీద నమోదైన కేసుల్లో విచారణ జరిపి చార్జిషీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఏడాది తర్వాత ఎంక్వయిరీ పేరుతో చార్జిషీట్ రీ ఓపెన్ చేశారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే.. 'ఓట్ల కోసం నేను లిక్కర్ పంచుతుంటే, ఒక వ్యక్తి ఇది తప్పని నన్ను ప్రశ్నిస్తే.. నేను అతడి మీద దాడి చేయించానని' నా మీద కేసు పెట్టారు. ఈ సంఘటన జరిగినట్టు పత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో కానీ ఎక్కడా వార్తలు రాలేదు. సర్వేపల్లి రిజర్వాయర్‌లో మట్టిని బాంబులు పెట్టి పేల్చానని నామీద అక్రమ కేసు పెడితే దానిపై మెజిస్ట్రేట్ రిమాండ్ నిరాకరించారు. వారు పెట్టిన కేసులు ఇంత చిత్రవిచిత్రంగా ఉన్నాయని చెప్పడానికి ఇవే ఉదాహరణలు. నేను తప్పు చేయలేదని బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించానే కానీ, ఎక్కడా ఆరోగ్యాన్ని సాకుగా చూపించి కోర్టును అభ్యర్థించలేదు. నెల్లూరు చరిత్రలో ఎన్నడూ ప్రజాప్రతినిధుల ఇంటి మీద దాడి జరగడం చూడలేదు. అలాంటిది మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిందే కాకుండా ఆయన మీదనే కేసులు పెట్టి ఆయన ముఖ్య అనుచరులను జైలుకు పంపారు. ఇలాంటి విపరీత ధోరణులు, వింత పోకడల మీద రాబోయే రోజుల్లో తప్పకుండా మాట్లాడతా. ప్రజల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్దం: ఈ జైళ్లు, కేసులు, అరెస్టులు తాత్కాలికంగా మమ్మల్ని నిలువరించగలవేమో కానీ లక్ష్యం చేరకుండా మమ్మల్ని ఏమాత్రం అడ్డుకోలేవు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడుతూ వైయస్ఆర్‌సీపీ బలోపేతం కోసం కృషి చేస్తా. ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో మా పంథా కొనసాగుతుంది. కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు. ప్రభుత్వ విధానాలపై పోరాటానికి నేను మానసికంగా, శారీరకంగా సిద్ధంగానే ఉన్నా. పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటా. వైయస్ జగన్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు: నా కుటుంబం కష్టాల్లో ఉందని, నా అనుకున్న వారి కోసం అండగా నిలబడాలని కూటమి పెట్టిన ఆంక్షలను సైతం లెక్కచేయకుండా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ గారు జైల్లో ఉన్న నన్ను పరామర్శించేందుకు రావడం మాకు మరింత స్థైర్యాన్నిచ్చింది. ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, చంద్రబాబు చేస్తున్న కుట్రలు, మోసాలను ప్రజల్లోకి వెళ్లనీయకండా ఇలాంటి అరెస్టులు చేసి కొన్నాళ్లు ఆయన ఉపశమనం పొందుతాడేమో కానీ, చివరికి వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టంగా చెబుతున్నా. సర్వేపల్లిలో సోమిరెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి నేను జైల్లో ఉన్న మూడు నెలలు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వీటన్నింటి మీద భవిష్యత్తులో విచారణ జరుగుతుంది. ఎవరు ఎంత తిన్నారో అంతా కక్కిస్తాం. నాకోసం, నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన నా కుమార్తె పూజితతో పాటు పార్టీ ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.