చంద్రబాబు కాళ్ళు పట్టుకుని తెచ్చుకున్న టీటీడీ చైర్మన్ గిరి..

ఆ పదవికే బీఆర్ నాయుడు మచ్చ..

మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు.

బ్రోకర్ రాజకీయాలు చేసినందుకు బీఆర్ నాయుడికి పదవీయోగం..

పవిత్రమైన శ్రీవారి క్షేత్రంలో ఉండి బీఆర్ నాయుడు తప్పుడు కూతలు..

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహారశైలి..

న్యూజెన్, ఆర్థో ఆయిల్స్‌ పేరుతో ప్రజలను వంచించిన మోసగాడు..

టీవీ5లో అర్థరాత్రి మిడ్‌నైట్ షోలు వేసిన ఘనుడు..

రేటింగ్స్‌ కోసం తప్పుడు విధానాలకు పాల్పడిన నీచుడు..

బీఆర్ నాయుడిపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

అటవీ సిబ్బందిపై దాడి చేసిన బుడ్డా రాజశేఖర్‌ను అరెస్ట్ చేయాలి..

తన శాఖ సిబ్బందిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్‌లో స్పందన లేదు..

పులివెందుల ఎన్నికపై మాట్లాడేందుకు మాత్రం తీరిక ఉంటుందా..?

టీడీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేయలేని అసమర్థతలో సీఎం చంద్రబాబు..

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం.

తాడేపల్లి: టీవీ5 మీడియా సంస్థ అధిపతిగా చేసిన బ్రోకర్ రాజకీయాలకు మెచ్చి బీఆర్ నాయుడికి సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాళ్ళు పట్టుకుని సంపాధించుకున్న టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు ఒక మచ్చలా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. పవిత్రమైన శ్రీవారి క్షేత్రంలో, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి బీఆర్ నాయుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. న్యూజెన్, ఆర్థో ఆయిల్ అంటూ ప్రజలను వంచించిన మోసగాడు బీఆర్ నాయుడు అని ధ్వజమెత్తారు. టీవీ5 లో అర్థరాత్రి మిడ్‌నైట్ మసాలా షోలు వేసిన దౌర్భాగ్య చరిత్ర ఆయనదేనన్నారు. బీఆర్ నాయకుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయనేమన్నారంటే...

హిందువులు పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రాన్ని తరచుగా వివాదాల్లోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు పవిత్రమైన తిరుమల క్షేత్రానికే మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నాడు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా ఆయన వ్యవహారశైలి ఉండటం లేదు. తిరుమల పవిత్రకు విఘాతం కలిగించేలా ఆయన ప్రవర్తిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సమక్షంలో ఎవరైనా సరే భక్తిభావంతో గోవిందనామంను పారాయణం చేస్తారు. కానీ టీటీడీ చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు మాత్రం శ్రీవారి సన్నిధిలో అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తూ, దూషణలకు దిగుతున్నాడు. ఆయన తిరులమలో నిర్వహిస్తున్న మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న భాషను చూసి హిందువులు బాధపడుతున్నారు. 

చంద్రబాబు మాహా పాపం చేశాడు:

బీఆర్ నాయుడు గతంలో ఆద్యాత్మిక సేవా రంగంలో ఉన్నారా? హిందూ ధర్మపరిరక్షణకు పాటుపడ్డారా? హిందూమతాన్ని గౌరవించి, ప్రచారం చేశారా? తిరుపతి క్షేత్రానికి ఏమైనా చేశారా అని చూస్తే ఒక్కటీ లేదు. కేవలం ఆయన ఒక వ్యాపారి. బీహెచ్‌సీఎల్‌లో ఉద్యోగం చేసేవాడు. తరువాత ఆయన టీవీ5 అనే మీడియా సంస్థను స్థాపించారు. ఈ టీవీలో చర్చలకు వచ్చే వారితో వైయస్ జగన్‌పై దూషణలు చేయించడం, చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం చేసేవారు. చంద్రబాబు సేవలో ఆయన తరించారు. దానికి ప్రతిఫలంగా టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. చంద్రబాబు కాళ్ళు పట్టుకున్నాడో... చంద్రబాబే ఈయన కాళ్ళు పట్టుకుని ఈ పదవిని అప్పగించాడో మాకు తెలియదు. కానీ బీఆర్ నాయుడి వంటి వ్యక్తికి ఇటువంటి పవిత్రమైన పదవిని కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు మహాపాపం చేశారు.

 బీఆర్ నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలి:

గతంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు భగవంతుడి దయవల్ల టీటీడీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తిరుమలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అటువంటి ఆయనను పట్టుకుని టీటీడీ చైర్మన్ స్థానంలో ఉన్న బీఆర్ నాయుడు 'వాడు, వీడు, డెకాయిట్' వంటి పదాలతో దూషణలకు దిగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. 'ఎవరితోనైనా పెట్టుకోండి, బీఆర్ నాయుడితో పెట్టుకుంటే సహించేది లేదు... మర్యాదగా ఉండదు, నేను ఎంతకైనా తెగిస్తాను' అని బెదిరింపులకు దిగడం ఆయన దిగజారుడుతనంకు నిదర్శనం. ఇష్టం వచ్చినట్లుగా భూమన కరుణాకర్‌రెడ్డి, వైయస్ జగన్ దంపతులపైన కూడా నోరుపారేసుకున్నాడు. ఆయనతో పెట్టుకుంటే ఏం చేస్తాడో చెప్పాలి. మాజీ మంత్రి రోజాను కూడా 'డైమండ్ రాణి' అంటూ నీచంగా మాట్లాడాడు. పవిత్రమైన స్థానంలో ఉండి, ఒక మహిళపైన ఇలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం ఆ పదవికే మచ్చ తెస్తున్నాడు. బీఆర్ నాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. 

మోసాలు, నీచాలతో పైకి వచ్చాడు:

టీవీ5 లో రేటింగ్ కోసం ఎటువంటి దిగజారుడు పనులు చేశాడో బీఆర్ నాయుడు మరిచిపోయాడు. రేటింగ్ మిషన్లను మేనేజ్ చేసిన విషయం వాస్తవం కాదా? రేటింగ్ కోసం టీవీ5లో మిడ్‌నైట్ మసాలా షోలు వేసిన ఘనుడు బీఆర్ నాయుడు. అటువంటి వ్యక్తికి పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిని ఇచ్చిన చంద్రబాబును ప్రజలు ఏమనుకోవాలి? బీఆర్ నాయుడు బట్టతలపై వెంట్రుకలు మెలిపిస్తానంటూ 'న్యూజెన్' బ్రాండ్‌తో నూనెను తీసుకువచ్చాడు. ఈ నూనె రాసుకున్న వారికి వెంట్రుకలు మొలవకపోగా, ఉన్నవి కూడా ఊడిపోయాయి. అసలు బీఆర్ నాయుడి తలపైనే వెంట్రుకలు తక్కువగా కనిపిస్తుంటాయి. ఆయనకు మొలవని వెంట్రుకలను దేశమంటా మొలిపిస్తానంటూ ప్రకటనలు చేసి, వినియోగదారులను మోసం చేసిన ఘనుడు. ఆ పేరుతో పెద్ద ఎత్తున డబ్బు వెనకేసుకు వచ్చాడు. తరువాత ఆర్థోజెన్ పేరుతో మోకాళ్ళ నెప్పులకు అంటూ మరో నూనె బ్రాండ్‌ను తీసుకువచ్చి, అమాయక ప్రజలను మోసగించిన దుర్మార్గుడు, మోసగాడు బీఆర్ నాయుడు. ఇలా మోసపూరిత బ్రాండ్‌లను మార్కెట్‌లో అమ్ముకుని, ప్రజలను వంచించి సొమ్ము వెనకేసుకున్న మాయగాడు బీఆర్ నాయుడు. 

ఆయన కాలుపెట్టగానే అన్నీ అశుభాలే:

పవిత్రమైన తిరుమలలో పర్వదినాల్లో లక్షల మంది భక్తులు వస్తుంటారు. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తరువాత టీటీడీలో ముక్కోటి ఏకాదశి కోసం వచ్చిన భక్తుల్లో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృత్యువాతపడ్డారు. పవిత్రమైన గోశాలలో వంద గోవులు అర్ధాంతరంగా మృత్యువాత పడ్డాయి. విషయం బయటకు రానివ్వకుండా బీఆర్ నాయుడు వ్యవహరించారు. ఇది మోసం కాదా? ఒక వీఐపీ దర్శనానికి వెడితే సామాన్యులు ఇబ్బంది పడతారని తన కోటా టిక్కెట్లను కూడా సగం వరకే జారీ చేస్తున్నాను అని బీఆర్ నాయుడు చెప్పుకుంటున్నాడు. కానీ కొండపైన బ్రేక్ దర్శనాన్ని వేల రూపాయలకు బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఈ బ్రోకర్లు ఎవరో బీఆర్ నాయుడికి తెలియదా? వారికి మద్దతు ఆయన కాదా? ఈ బ్లాక్ దందాను అరికట్టేందుకు మాత్రం ఆయన చర్యలు తీసుకోరు. బ్రోకర్లను పెట్టుకుని, టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు. బ్రోకర్ రాజకీయాలు చేసే మనిషి బీఆర్ నాయుడు. అందుకే చంద్రబాబు ఏరికోరి నీకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చాడు. బీఆర్ నాయుడి కుమారుడు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపార అవసరాల కోసం వచ్చే వారికి దర్శనాలు చేయడం, తన సొంత వ్యాపారాలకు వారిని వాడుకోవడం చేస్తున్నారు. వైయస్ జగన్‌ను ఉద్దేశించి ఏం పీకుతారు అని శ్రీవారి క్షేత్రంలో కూర్చుని మాట్లాడాడు. ఇటువంటి భాష వాడినందుకు ఆ భాగవంతుడే బీఆర్ నాయుడిని రెండు పీకుతారు. హిందుత్వానికి సంబంధించిన దేవాలయానికి చైర్మన్‌గా ఉండి తప్పుడు మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏఐ పేరుతో దర్శనాలు చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ ఈఓగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందిస్తే, ఆయనపైన కూడా ఇదే తరహాలో దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. స్వామివారి దర్శనానికి నేను తరచుగా వెళ్ళను అని చెప్పుకునే బీఆర్ నాయుడు, తరచుగా తన కుమారుడితో కలిసి గోవా ఎందుకు వెడతాడో అందరికీ తెలుసు. బీఆర్ నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇదే తరహాలో మాట్లాడితే తగిన శాస్తి చేస్తాం. 

టీడీపీ ఎమ్మెల్యేలే అరాచకశక్తులు:

టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పవిత్రమైన శ్రీశైలం కొండ మీది గెస్ట్‌హౌస్‌లో మద్యం తాగి కిందికి వస్తూ, అటవీశాఖ సిబ్బంది టోల్‌గేట్ వద్ద ఆపితే వారిపై దౌర్జన్యం చేశారు. గతంలో అడవిదొంగ వీరప్పన్ చేసినట్లుగా అటవీ సిబ్బందిని కిడ్నాప్‌ చేసి, గెస్ట్‌హౌస్‌కు తీసుకువెళ్ళి మరీ వారిని కొట్టారు. ఈ ఘటన మీడియా ద్వారా వెలుగుచూడటంతో సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని వారికి అనుకూలమైన మీడియాలో గొప్పగా రాశారు. టైగర్ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రాత్రిపూట ప్రయాణించకూడదనే విషయం ఎమ్మెల్యేగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి తెలియదా? దీనిని ప్రశ్నించిన అటవీసిబ్బందికే రక్షణ లేని స్థితిలో వారిపై దౌర్జన్యం చేశారు. దీనిపై మొత్తం అటవీశాఖ అధికారులు ఆగ్రహంతో ఉండటంతో ఏదో చిన్నపాటి కేసు పెట్టి, సీఎం ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం చేసుకుని సద్దుమణిగించేలా చేస్తున్నారు. 
అటవీ సిబ్బందిపై దాడి చేసిన బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని అరెస్ట్ చేసి, జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నాం. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్‌లో ఉండి ఉంటారు. తన డిపార్ట్‌మెంట్‌లోని అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే, ఆయన కనీసం స్పందిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కనీసం తన పరిధిలోని సిబ్బందికి అయినా ఆయన భరోసా కల్పిస్తారా? పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల గురించి మాట్లాడే ఆయనకు తన శాఖలోని సిబ్బందిపై జరిగిన దాడి పట్టదా? ఈ రాష్ట్రంలో కీలుబొమ్మ మంత్రిగా ఉన్న హోంమంత్రి ఈ ఘటనపై ఏమైనా స్పందిస్తారా? ఇటువంటి వాటిని పట్టించుకోకుండా అమరావతి మునిగిందని అన్న ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టాలని ఆదేశిస్తున్నారు. సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి కొత్తగా వేసిన బైపాస్‌కు గండి కొట్టి, మరీ వరదనీటిని వదిలితే తప్ప అమరావతిలో వరద బయటకు పోలేదు. ఇది నిజం కాదా?   

ఇక ఇదే టీడీపీలోని మరో ఎమ్మెల్యే ఒక సినిమాను ఆడనివ్వనూ అంటూ, ఆ సినిమా హీరోపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై ఫ్యాన్స్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, అతడిని సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారని ప్రచారం చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యేతో చంద్రబాబు ఏం మాట్లాడారంటే బాగా దూషించావని చెప్పి ఉంటాడు. ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేల దమనకాండ, దౌర్జన్యాలకు చంద్రబాబు పులిస్టాప్ పెట్టకపోతే, మీకే ప్రజలు పులిస్టాఫ్ పెడతారు.

Back to Top