తాడేపల్లి: అధికారంలోకి వస్తే బ్యాడ్జి ఉన్న ప్రతి ఒక్క ఆటో డ్రైవర్, లారీ, టిప్పర్ డ్రైవర్ లకు రూ. 15వేలు ఇస్తామని చంద్రబాబు, లోకేష్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక దారుణంగా మోసగించారని వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు పూనూరు గౌతమ్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వాహనమిత్ర పథకం కింద వైయస్ జగన్ ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తుంటే, తాము అధికారంలోకి వస్తే రూ.15వేలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు, 15 లక్షల మంది లబ్ధిదారులుంటే కేవలం 2.90 లక్షల మందికే జమ చేసి 80 శాతం మందికి వెన్నుపోటు పొడిచాడని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, ఇప్పుడు చేసే పనులకు పొంతన ఉండటం లేదని అన్నారు. పైగా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పథకాన్ని అమలు చేస్తున్నట్టు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పుకోవడం సిగ్గుచేటని గౌతమ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్లకు అండగా వైయస్ఆర్‌సీపీ పోరాడుతుందని, ఈనెలలోనే వారితో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు అర్హులైన ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి రూ.15 వేలు జమ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● కార్మిక వ్యతిరేకినని చంద్రబాబు నిరూపించుకున్నాడు 16 నెలల కూటమి పాలనంతా మోసం, దగా, వెన్నుపోటు, అబద్ధాలకి ప్రతిరూపంగా నిలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వేరు, అమలు చేస్తున్న తీరు వేరు, అమలు చేశామని చెప్పుకునే విధానం అంతకన్నా వేరుగా ఉంది. 8 గంటల పనిదినం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమాలు జరిగి ఎంతో మంది కార్మికులు అసువులుబాశారు. కానీ 8 గంటల పని విధానాన్ని 10 గంటలకు పెంచేలా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వత్తాసు పలికి తాను కార్మికుల వ్యతిరేకినని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నాడు. టెంపరరీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం వైయస్ జగన్ ఆప్కాస్‌ను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేశాడు. ఫైబర్ నెట్, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులను తొలగించారు. అన్యాయంగా వారి కుటుంబాలను రోడ్డున పడేశారు. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు 53 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేశాడు. గతంలో వేతనాలు పెంచమని అడిగిన నాయీ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తామని బెదిరించింది కూడా ఈ చంద్రబాబే. చంద్రబాబు చేతిలో మోసపోయిన వారి జాబితాలో కొత్తగా ఆటో డ్రైవర్లు కూడా చేరిపోయారు. ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కూటమి ప్రభుత్వం అని చెప్పి తీరా అమలులోకి వచ్చేసరికి కొందరికే పథకాన్ని అమలు చేసి బురిడీ కొట్టించారు. మేనిఫెస్టోను యథాతథంగా ఏనాడూ అమలు చేయని చంద్రబాబు మరోసారి తన ట్రాక్ రికార్డును కొనసాగించాడు. విశాఖ ఉక్కు విషయంలోనూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం అని చెబుతారు, కానీ టీడీపీ సపోర్టుతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకి చకచకా అడుగులు ముందుకేస్తున్నా అడ్డు చెప్పడం లేదు. ● 15 లక్షల మందిలో 2.90 లక్షల మందికే.. 2024 ఎన్నికల ముందు బ్యాడ్జి ఉన్న ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామని టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. వైయస్ జగన్ ఆటో డ్రైవర్లకు రూ. 10వేలే ఇస్తున్నాడు, కూటమి ప్రభుత్వం వస్తే ఏడాదికి రూ. 15వేలు ఇస్తానని యువగళం పాదయాత్రలో పదేపదే నమ్మబలికాడు. బ్యాడ్జి ఉన్న డ్రైవర్లు 13 లక్షల మంది ఉన్నారని తమ పార్టీ అధికారంలోకి వస్తే వారందరికీ పథకాన్ని అమలు చేస్తామని నారా లోకేష్ 2023లోనే ప్రకటించారు. ఈ రెండేళ్లలో డ్రైవర్ల సంఖ్య మరో 2 లక్షలు పెరిగి 15 లక్షల మంది అయ్యారని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. అంటే 15 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ. 15వేల చొప్పున పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.2250 కోట్లు కేటాయించాలి. కానీ ఆటో డ్రైవర్ల సేవలో.. పథకానికి సంబంధించి అర్హత నిబంధనల పేరుతోనే ఏకంగా 10 లక్షల మందికి కోత విధించారు. ఇక దరఖాస్తు చేసిన 3,21,531 మందికి కూడా పథకాన్ని వర్తింప చేయలేదు. వారిలో కూడా 2,90,669 మందినే అర్హులుగా ప్రకటించారు. దాంతో ఈ పథకం కింద ఆర్థిక సహాయం రూ.436 కోట్లకే సరిపెట్టారు. ఇస్తామని ఎన్నికల్లో చెప్పింది రూ.2,250 కోట్లు కాగా, ఇచ్చింది కేవలం రూ.436 కోట్లే. అంటే ఇచ్చిన హామీలో 80 శాతం కోత విధించారన్నది స్పష్టమవుతోంది. అదీ చంద్రబాబు మార్కు బురిడీ అంటే అని మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేశారు. ● గ్రీన్ ట్యాక్స్ చేస్తానని పట్టించుకోవడం లేదు ఆటో డ్రైవర్లకు కొత్త బ్యాటరీ ఆటోలు కొనిస్తానంటూ చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక కొత్తగా ఆటో కొనుగోలు చేస్తే 5 శాతం సబ్సిడీ ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆ సంగతే మర్చిపోయాడు. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత తూతూమంత్రంగా పథకాన్ని అమలు చేయడమే కాకుండా ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే అమలు చేశామని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు. మహిళలకు ఉచిత బస్సు తరహాలోనే ఆటో డ్రైవర్లకు వెన్నుపోటు పొడిచాడు. కూటమి ప్రభుత్వంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ రావాలంటే రూ.3650 లు చెల్లించాలి. ఫిట్‌నెస్‌కి వెళ్లినప్పుడు రూ. 860లతో ఛలానా తీయాలి. ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలైతే మరో రూ.660 లు చెల్లించాలి. అధికారంలోకి వస్తానే జీవో నెంబర్ 21 రద్దు చేస్తానని హామీ ఇచ్చాడు. హిట్ అండ్ రన్ కేసుల్లో విధించే సెక్షన్ 601, 602 రద్దు చేస్తానని నమ్మబలికాడు. గ్రీన్ రద్దు చేస్తానని చెప్పినా దాన్ని పట్టించుకోలేదు. ● ఆటో డ్రైవర్లకు అండగా నిలచిన వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వైయస్ జగన్ పాదయాత్రలో ఉండగా తనని కలిసిన ఆటోడ్రైవర్లకు వాహనాల మెయింటినెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ నిమిత్తం ఏడాదికి రూ. 10వేలు ఇస్తానని మచిలీపట్నంలో మాటిచ్చారు. ఏలూరు సభలో ఆ మేరకు హామీ కూడా ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మొదటి ఏడాది అని ఎగురవేయకుండా వైయస్ఆర్‌సీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాహన మిత్ర పథకాన్ని అందించింది. సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సి కేబ్, రేషన్ వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.10వేలు చొప్పున వారి అకౌంట్‌లలో జమచేశాం. చివరి ఏడాది ఎన్నికల నియమావళి అని సాకుతో తప్పించుకోలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే ఏమిటో వైఎస్ జగన్ చేతల్లో చేసి చూపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 15 లక్షల మంది ఆటో డ్రైవర్లకి పథకాన్ని వర్తింపజేయాలి. ఆటో డ్రైవర్లతో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఈనెల 15 లేదా 17 తేదీల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సమావేశంలో కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని ఆటో యూనియన్లు అన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తాం. బ్యాడ్జి ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కి పథకాన్ని అమలు చేసేదాకా వైయస్ఆర్‌సీపీవారి పక్షాన నిలబడి పోరాడుతుంది. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మిక చట్టాలను పటిస్టంగా అమలు చేయాలి. ● జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానాలు ఆటో డ్రైవర్లకు వెన్నుపోటు పొడిచిందే కాకుండా ఉబెర్, ఓలా తరహాలో కొత్త విధానాన్ని తీసుకొస్తానని ముఖ్యమంత్రి చెప్పడం వారిని మరింత వంచించడమే. ఆ విధంగా రవాణా రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలో నకిలీ మద్యం దందాకి చంద్రబాబే సూత్రధారి. రాష్ట్రంలో గుట్టురట్టవుతున్న కల్తీ మద్యం రాకెట్ లో నిందితులంతా టీడీపీ నాయకులే ఉంటున్నారు. సీబీఐతో విచారణ చేయిస్తే జైళ్లకు వెళ్లేవాళ్లంతా టీడీపీ నాయకులే ఉంటారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ సేవలందిస్తుంటే వారిని తీసేసి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మీద పనిభారం మోపి ఒత్తిడి పెంచి వేధిస్తున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగుల ఉద్యమానికి వైయస్ఆర్‌సీపీ మద్దతు ఉంటుంది. వైయస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో చివరి ఏడాది మినహా ఎక్కడా ఉద్యమాలు లేకుండానే చర్చలు ద్వారా సమస్యలు పరిష్కరించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాకుండానే విద్యార్ధులు, ఉద్యోగులు, అంగన్‌వాడీలు, టీచర్లు, డాక్టర్ యూనియన్లు, కాంట్రాక్టు వర్కర్లు, మున్సిపాలిటీ వర్కర్లు, రైతులు, వ్యాపారులు.. ఇలా అన్ని వర్గాల వారు ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సమ్మెబాట పడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఫెయిలైందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు.