తిరుపతి: టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి మరణిస్తే పరామర్శ కోసం పెద్ద కర్మలకు వెళ్లిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనకు పరివట్టం చేయడం ఘోర అపచారమని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకయ్య చౌదరికి పరమ పవిత్రమైన శ్రీవారి శాలువా కప్పి లడ్డూ ప్రసాదం అందజేయడంతో పాటు ఆలయ వేద పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించడం శ్రీవారి ఆలయ మర్యాదలు మంటగలపడమేనని అన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో బీఆర్ నాయుడు పదే పదే ఘోరంగా విఫలమవుతున్నారని, హిందూ ధర్మం గురించి తెలియని వ్యక్తిని చైర్మన్ గా తీసుకొచ్చి పెట్టి కూటమి ప్రభుత్వం ఘోరమైన తప్పు చేసిందని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే.. శ్రీవారి సేవల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి ప్రవర్తన చాలా సందర్భాల్లో అభ్యంతరకరంగా ఉంటోందని, చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ప్రవర్తించడం సమంజసం కాదని పలు సందర్భాల్లో చెబితే నా మీద వ్యక్తిగతంగా దాడి చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కానీ ఆయన మాత్రం తన ప్రవర్తన మార్చుకోవడం లేదు. తాజాగా 13 రోజుల క్రితం టీటీడీ అడిషినల్ ఈవో వెంకయ్య చౌదరి తండ్రి చిరుమామిళ్ల చలమయ్య గారు అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆయన బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొనలేకపోయారు. అయితే వెంకయ్య చౌదరి తండ్రి పెద్ద కర్మల రోజున టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాచర్లలో వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారని వారి ఛానెల్ టీవీ 5లోనే వచ్చింది. (ఈ వీడియోను ప్రదర్శించారు.) ఆయనతోపాటు పలువురు పాలకమండలి సభ్యులు, అధికారులు వెంకయ్య చౌదరిని పరామర్శించారని స్పస్టంగా ఆ టీవీ5 వీడియోలోనే ఉంది. అంతేకాకుండా రంగనాయకుల మండపంలో కప్పే అత్యంత పవిత్రమైన శంఖు చక్రాలతో కూడిన శాలువాను పెద్దకర్మల రోజున వెంకయ్య చౌదరికి కప్పడమే కాకుండా సాక్షాత్తు స్వామి వారి లడ్డూ ప్రసాదాలను పట్టుకుని పరివట్టం కట్టి వేదపండితుల చేత ప్రత్యేకమైన వేద ఆశీర్వచనాలు ఇప్పించారు. ● పెద్దకర్మల రోజుల పరివట్టం చేయడం తప్పు కాదా? పరివట్టం అనేది అత్యంత పవిత్రమైన విషయం. అందుకే బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాక రంగనాయకుల మండపంలో కానీ, బంగారు వాకిలిలో గానీ, ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్‌కి లేదా వారి కన్నా ముందుగా జీయర్‌స్వామికి పరివట్టం కడతారు. ఇదంతా స్వామి వారి నగలను పర్యవేక్షించే బొక్కసం ఇన్చార్జి పర్యవేక్షణలో చేయడం హిందూ సమాజాన్ని తీవ్రంగా ఆవేదనకు గురిచేసింది. పెద్ద కర్మల రోజున పవిత్రమైన స్వామి వారి వస్త్రం కప్పి, పరివట్టం చేయడం కలియుగదైవమైన శ్రీవారి ఆలయ మర్యాదలను మంటగల్పడమే. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపర్చడమే అవుతుంది. హిందూ ధర్మం అర్థం పరమార్థం తెలియని వ్యక్తిని టీటీడీ చైర్మన్ స్థానంలో కూర్చోబెడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అవసరం లేదు. వధువుకి, విధవకి తేడా తెలియని మనిషిలా టీటీడీ చైర్మన్ ప్రవర్తిస్తున్నాడు. ఆ కటుంబాన్ని పరామర్శించడాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ పరామర్శ పేరుతో చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని పెద్ద కర్మల రోజున మరణించిన వ్యక్తి చిత్రపటం ఎదురుగా పరివట్టం చేయించిన బీఆర్ నాయుడి దాష్టీకాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. కర్మక్రియల రోజున ఏటి సూతకం ఉన్న కుటుంబానికి స్వామి వారి లడ్డూ ప్రసాదంతోపాటు వేద ఆశీర్వచనాలు అందించడం ఎవరైనా చేస్తారా? ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ● రియల్ ఎస్టేట్ సంస్థలో శ్రీవారి ఆలయమా? కోయంబత్తూరుకి చెందిన జీ స్వ్వేర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ తమ వెంచర్‌లో శ్రీవారి ఆలయం నిర్మాణానికి అనుమతివ్వాలని ముఖ్యమంత్రికి ఆగస్టులో లేఖ రాసింది. రేపు జరగబోయే టీటీడీ పాలకమండలి సమావేశంలో ఈ అంశాన్ని ఎజెండాగా చేర్చబోతున్నారు. ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా దీన్ని 24వ అంశంగా చేర్చబోతున్నారు. 900 ఎకరాల్లో రియల్ వెంచర్‌ను అభివృద్ధి చేస్తున్న ఆ సంస్థ గిరాకీ పెంచుకోవడానికి ఏకంగా శ్రీవారినే వాడుకోవడానికి సిద్ధమైతే దానికి సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ వంతపాడటం మరింత దారుణం. జీ స్వ్వేర్ సంస్థ డెవలప్ చేస్తున్న ఈ 900 ఎకరాల వెంఛర్‌పై గతంలో తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆరోపణలు చేయగా ఇప్పుడు ఈడీ విచారణ జరుగుతోంది. అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంచర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించాలనుకోవడం హిందూ భక్తుల మనోభావాలను కించపర్చడమే. ఇదంతా చూస్తుంటే జీ స్వ్వేర్ రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి భాగస్వామ్యం ఉందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇలా కట్టుకుంటూపోతే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ రియల్ ఎస్టేట్ వెంచర్లలో స్వామి ఆలయ నిర్మాణానికి స్థలం ఇస్తామని ముందుకొస్తే ఏంటి పరిస్థితి అనేది ఆలోచించారా అని ప్రశ్నిస్తున్నా. సాక్షాత్తూ సీఎం కార్యాలయం ఇలాంటి వాటికి ఎలా అనుమతులిస్తుందో అర్థం కావడం లేదు. ● బ్రహ్మోత్సవాల నిర్వహణలోనూ వైఫల్యం టీటీడీ చరిత్రలో తొలిసారి స్వామి వారి బ్రహ్మోత్సవాలను అత్యద్భుతంగా నిర్వహంచినట్టు అధికారులకు సీఎం చంద్రబాబు అభినందన సందేశం రాయడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే టీటీడీ ఉద్యోగుల నిబద్ధత కారణంగా బ్రహ్మోత్సవాలు ఏటా విజయవంతం అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకించి అభినందనలు తెలపడం ఆశ్చర్యకరంగా ఉంది. దేవుడి చేసుకున్న ఉత్సవాలను కూడా తమ ప్రభుత్వ గొప్పతనంగా చెప్పుకోవడం సిగ్గుచేటు. బ్రహ్మోత్సవాల రెండో రోజైన గరుడ సేవ రోజున బీఆర్ నాయుడు సైన్యం 500 మంది వాహన సేవ ముందు చేరితే వారిపై టీటీడీ ఈవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన జరిగిన విషయం నిజమో కాదో బీఆర్ నాయుడు చెప్పాలి. ఆ మరుసటి రోజున టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాయమైపోయింది నిజమా కదా? అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర నుంచి తిరుచానూరు వరకు గరుడ వారధితో సహా వాహనాలను రాకుండా చేసి భక్తులను నియంత్రించిన మాట వాస్తవమా కాదా? ఇంత దారుణంగా నిర్వహించి అద్భుతంగా చేశామని మీకు మీరు చెప్పుకుంటే సరిపోతుందా? దీంతోపాటు ఉద్యానవనంలో ఫల పుష్ప శాలలో సాల్వ శరభ ప్రతిరూపాల ఏర్పాటు జరిగాయి. ఇది స్వామి వారి ఆలయానికి సంబంధించి చాలా అభ్యంతరకరమైన విషయం. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఎంతోమంది శ్రీవైష్ణవులు ఈవోకి మెయిల్స్ చేసి ఫిర్యాదు చేసింది నిజమో కాదో స్పష్టం చేయాలి. 108 వైష్ణవ దివ్య దేశాల్లో శ్రీరంగం మొదటిది. తిరుమల రెండవది. అలాంటి చోట ఈరకమైన చర్యలు సమర్థనీయమా అని చైర్మన్ బీఆర్ నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నా.