తాడేపల్లి: సీఎం చంద్రబాబు మాదిరిగా ఆయన దత్తపుత్రుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ, గత ప్రభుత్వంలో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ చేసిన మంచిని తన ఖాతాలో వేసుకొని క్రెడిట్‌చోరీ చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి ఆక్షేపించారు. పంచాయతీ రాజ్ శాఖలో 10 వేల మందికి డీడీఓలుగా పదోన్నతి కల్పించామన్న పవన్ మాటలు, పూర్తిగా అవాస్తవమని, ఆ పోస్టులు జగన్‌గారి హయాంలో క్రియేట్ చేసినవని వెల్లడించారు. బాప్టిజమ్ తీసుకున్న పవన్‌కళ్యాణ్, హిందువుగా ఎప్పుడు మారారని ప్రశ్నించారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 40 గుళ్లు కూల్చివేస్తే, నోరు మెదపని పవన్‌కళ్యాణ్ హిందూ రక్షకుడు ఎలా అవుతాడని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్‌రెడ్డి గట్టిగా నిలదీశారు. ప్రెస్‌మీట్‌లో కారుమూరి వెంకట్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..: పేరు మార్చితే క్రెడిట్ వస్తుందా?: వేరొకరు చేసిన వాటిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుని గొప్పలు చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం సీఎం చంద్రబాబు లక్షణం. ఆయన దత్తపుత్రుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కూడా సరిగ్గా అదే బాటలో నడుస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో 10 వేల మందికి పదోన్నతి కల్పించామని పవన్ చెప్పుకోవడం ఆశ్చర్యకరం. అసలు దీనిపై ఆయనకు కనీస అవగాహన ఉందా? అన్న సందేహం వస్తోంది. గత ప్రభుత్వంలో జగన్‌గారి హయాంలో ఇచ్చిన పదోన్నతులను తన ఖాతాలో వేసుకుంటూ.. ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు పదోన్నతులు పొందలేదని చెప్పడం çపచ్చి అబద్ధం. నిజానికి గత ప్రభుత్వ హయాంలోనే దాదాపు 25 ఏళ్లుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీఓలకు పదోన్నతి అవకాశం వచ్చింది. ఆ మేరకు నాటి సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రత్యేకంగా చొరవ చూపి, ఎంపీడీఓలకు పదోన్నతి కల్పించారు. ఇంకా నాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అత్యంత సమర్థంగా పని చేసేలా, నాటి సీఎం శ్రీ వైయస్ జగన్, పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీఎల్‌డీఓ) పోస్టులు సృష్టించారు. ఆ మేరకు గత ప్రభుత్వం 2020, సెప్టెంబరు 30న జీఓ నెం:674 జారీ చేసింది. ఆ అధికారి పోస్టులో డివిజినల్ అన్న పదానికి సంక్షిప్తంగా డీఎల్ ఉండి.. ఆ పోస్టును ‘డీఎల్‌డీఓ’గా చెప్పగా, ఇప్పుడు అందులో నుంచి ‘ఎల్’ మాత్రం తొలగించి..‘డీడీఓ’గా పేరు మార్చారు. అలా కేవలం పేరు మాత్రమే మార్చి, ఆ పోస్టులు తామే సృష్టించినట్లు డిప్యూటీ సీఎం నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. కేవలం పేరు మార్చినంత మాత్రాన క్రెడిట్ వస్తుందా?. నీకు ఏ క్రెడిట్ రాదు. గుర్తుంచుకో: అయ్యా పవన్ కళ్యాణ్, నువ్వు ఎంత క్రెడిట్ చోరీ చేసినా, నీకు ఏ ప్రైజ్‌మనీ రాదు. ప్రైజ్‌మనీని ఎప్పుడైనా సీఎం చంద్రబాబు తన కొడుకు లోకేష్‌కే ఇస్తాడు. నీకు మాత్రం ఎప్పటికీ రాదు. గుర్తుంచుకో. ఇదే వాస్తవం. ఎందుకంటే క్రెడిట్ చోరీ విషయంలో నువ్వు వాళ్ల స్థాయికి చేరలేవు. నువ్వు రోడ్లపై పడుకోవడం, కారు మీదెక్కి డ్యాన్స్ చేయడం, చెప్పు తీసి బూతులు తిట్టడం, ‘పీకలు పిసికి చంపేస్తా’ అని అరవడం చేస్తావు. ఆ సినిమాటిక్ చర్యలు, డైలాగ్స్‌కు కాస్త రివార్డ్ ఇస్తారేమో కానీ.. ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్ చోరీలో ఒక్క పైసా రాదు. ఇప్పటికే అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అంటూ లోకేష్ ఆలోచన అని చంద్రబాబు కితాబిచ్చాడు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. పవన్ హిందూ రక్షకుడా?: తాను బాప్టిజమ్ తీసుకున్నట్లు పవన్‌కళ్యాణ్ గతంలో చెప్పారు. మరి ఆయన హిందువుగా ఎప్పుడు మారారు? 2014–2019 మధ్య అప్పటి టీడీపీ కూటమి ప్రభుత్వం 40 ఆలయాల కూల్చివేస్తే, ప్రశ్నించేందుకే తాను పార్టీ పెట్టానన్న పవన్, అప్పుడు ఏరోజు స్పందించలేదు. మరి ఆయన హిందూ రక్షకుడా?. అదే గత ప్రభుత్వంలో, శ్రీ వైయస్ జగన్ సీఎంగా ఉండగా, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3,800 ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయినా ఇప్పుడు కూడా జగన్‌గారిపై నిత్యం బురద చల్లుతూ, ఆయన్ను నిందిస్తున్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు: రోజుకో ఆరోపణ చేస్తూ, తమ స్వార్థ రాజకీయాల కోసం, టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఇప్పుడు తాజాగా, 2015లో చంద్రబాబు కాలంలో ఇచ్చిన శాలువాల టెండర్లను, గత వైయస్ఆర్‌సీపీపీ ప్రభుత్వానికి అంటగట్టి, అవినీతి ఆరోపణలు చేస్తూ, బుదర చల్లుతున్నారు. అసలు పరకామణిలో చోరీ గురించి, ఇంకా అసత్యాలు చెబుతూ నిందిస్తున్న ఇదే కూటమి పెద్దలు, నాయకులు.. సింహాచలం, అహోబిలం, కదిరి ఆలయాల్లో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడడం లేదు?. ఆ దొంగతనాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు. తమ స్వప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం తిరుమల దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగి, కోట్లాది భక్తుల మనోభావాలతో ఈ కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని కారుమూరి వెంకట్‌రెడ్డి ఆక్షేపించారు.