ప్రజలు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి?

నిమ్మగడ్డ తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ధ్వజం

2018లో జ‌ర‌గాల్సిన ఎన్నికలు 2021లో జరగడానికి కారకులు ఎవరు?

ప్రంట్ లైన్ వారియర్స్‌ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై లేదా?

  శ్రీకాకుళం: ఎన్నిక‌లు వ‌ద్ద‌ని ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే మీ ప‌రిస్థితి ఏంట‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌ను అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్ర‌శ్నించారు. 2018లో జ‌ర‌గాల్సిన ఎన్నిక‌ల‌ను ఇవాళ ఎవ‌రికి ల‌బ్ధి చేకూర్చేందుకు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశార‌ని నిల‌దీశారు. క‌రోనా స‌మయంలో ఎన్జీవోలు ఎన్నికల విధులు బహిష్కరించారు. రేపో మాపో పోలీసులు కూడా ఎన్నికలను బహిష్కరిస్తార‌ని... అప్పుడు ఎవరు ఎన్నికలు నిర్వహిస్తార‌ని ప్ర‌శ్నించారు.  శ‌నివారం త‌మ్మినేని సీతారాం నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ తీరును త‌ప్పుప‌ట్టారు.

ఎవరి ప్రాపకం కోసం ఎన్నిక‌లు..

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ప్రెస్‌ మీట్‌ కేవలం పొలిటికల్‌ సమావేశంలా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. 2018లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు.. 2021లో జరగడానికి కారకులు ఎవరని ప్రశ్నిస్తూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్రంలో మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న తరుణంలో ఎవరి ప్రాపకం, రాజకీయ లబ్ధి కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మీరు చుట్టూ అద్దాలు బిగించుకుని ప్రెస్ మీట్ పెట్టారు. రేపు ఎన్నికల పోలింగ్ కోసం ఇతర ప్రాంతాల నుండి వలస కార్మికులు వస్తారు. గతంలో వలస కార్మికుల ద్వారా కరోనా వ్యాపించిన సందర్భం ఉంది. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ఎన్నికల నిర్వహిస్తే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పొతే ఎవరు బాధ్యత తీసుకుంటారు. మీరు ఫాల్స్ ప్రెస్టేజ్‌కు పోతున్నారు. 

ఎందుకంత నియంతృత్వ పోకడ..

మీరు కుర్చీలో ఉండగా ఎన్నికలు జరపాలా.. మరొకరు జరపకూడదా.. ఎందుకంత నియంతృత్వ పోకడ అంటూ తమ్మినేని సీతారాం నిప్పులు చెరిగారు. ప్రంట్ లైన్ వారియర్స్‌ రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపై లేదా.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి బెదిరింపు ధోరణిలో వెళ్లడం సబబేనా.. ఒక రాజ్యాంగ వ్యవస్థ అధిపతిగా ఉండి నిబంధనలను అతిక్రమిస్తున్నారు. సీఎస్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయస్థానం తీర్పును మీరు ఉల్లంఘించలేదా అంటూ స్పీకర్‌ ప్రశ్నలు గుప్పించారు. 

ఎన్నిక‌లు ఆపాల్సిన అవ‌స‌రం ఉంది..

 రాజ్యాంగంలో పొందు పరచిన ఫోర్స్ మెజర్ కేసు క్రింద పరిగణించి ఎన్నికలను ఆపాల్సిన అవసరం ఉంద‌ని స్పీక‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉంది. దాన్ని కాలరాస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న మీకు రైట్ టూ లివ్ ఆర్టికల్ మీకు తెలియదా..?. కొద్ది మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం మీరు తీసుకున్న నిర్ణయం ప్రజల ధన, మాన, ప్రాణాలకు భంగం వాటిల్లుతుంది. దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. న్యాయస్థానం ఏం చెబుతుందో వేచి చూడాలి. దీనిపై ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవసరం అయితే దీనిపై ప్రజల్లోకి రెఫరెండం(ఎన్నికల నిర్వహణ పై ప్రజాభిప్రాయ సేకరణ )కు వెళ్లాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు

తాజా వీడియోలు

Back to Top