దేవుని కడపలో పాప ప‌రిహార‌ పూజలు

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం

చంద్రబాబు–పవన్ భక్తులకు క్షమాపణ చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి డిమాండ్‌

వైయ‌స్ఆర్ జిల్లా: తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు సాగించిన విషప్రచారం పూర్తిగా అసత్యమని సీబీఐ సిట్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో స్పష్టమైన నేపథ్యంలో, వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాష, రాజంపేట పరిశీలకులు కే. సురేష్ బాబు, ఎస్‌ఈసీ మెంబర్ మాసిమా బాబు, నగర మేయర్ పాక సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొని వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ పవిత్రతపై అపవాదు తొలగిన సందర్భంగా, కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లు ఎలాంటి ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. సీబీఐ సిట్ విచారణలో అలాంటిదేమీ లేదని తేలినా, ఇప్పటివరకు వారు నోరు విప్పకపోవడం వారి రాజకీయ ద్వంద్వత్వాన్ని బయటపెడుతోందన్నారు.

ఈ అసత్య ఆరోపణలను ఖండిస్తూ అప్పటి టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారని, పూర్తి స్థాయి విచారణ అనంతరం సీబీఐ సిట్ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు పదార్థాలు కలపలేదని స్పష్టంగా నిర్ధారించిందని గుర్తు చేశారు. కల్తీ నెయ్యి కాదని, చంద్రబాబు చేస్తున్నది కల్తీ రాజకీయం అని విమర్శలు గుప్పించారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యవహరించారని ఆరోపించారు. అయితే ప్రజలు ఇప్పుడు నిజానిజాలను తెలుసుకున్నారని, రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. చేసిన తప్పులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు శ్రీవారి భక్తులందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్‌చార్జీలు, జిల్లా–నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నగర స్థాయి నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Back to Top