తాడేపల్లి: కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలోనూ, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర హాని జరుగుతుందని తెలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కనీసం స్పందించకపోవడం దారుణమని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా సీఎం చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చించకుండా వైయస్ జగన్‌ని దూషించి, వ్యక్తిత్వ హననం చేయడానికే వాడుకున్నారని సతీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలోని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్, చిరంజీవి గురించి బాలకృష్ణ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే అక్కడే ఉన్న సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారా అని నిలదీశారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే బాలకృష్ణతో చిరంజీవిని తిట్టించారని, కాపు సమాజంపై తమ విద్వేషాన్ని ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే వైయస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● ఆల్మట్టి ఎత్తు పెంపుతో రాయలసీమకు అన్యాయం కర్నాటకలో కృష్ణానదిపై ఆల్మట్టి ఎత్తును పెంచే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తూ కూర్చున్నాడు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచే పనులను కర్ణాటక ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేయడానికి సిద్ధమైంది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 5.1 మీటర్లు పెంచడం ద్వారా 123 టీఎంసీల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ 223 టీఎంసీలకు పెరగనుంది. ప్రాజెక్టు సామర్థ్యం దాదాపు 100 టీఎంసీలు పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచితే దిగువన కృష్ణా జలాల మీద ఆధారపడ్డ రాయలసీమ ప్రాంతానికి, నాగార్జున సాగర్ నీటి మీద ఆధారపడిన రైతాంగానికి తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. గుట్టుచప్పుడు కాకుండా కర్నాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తును పెంచడానికి చకచకా ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంటే చంద్రబాబు మాత్రం చడీచప్పుడు లేకుండా కళ్లప్పగించి చూడటాన్ని రైతులు జీర్ణించుకోలేపోతున్నారు. వర్షాలు సమృద్ధిగా ఉన్నప్పుడు పెద్దగా సమస్య లేకపోయినా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు. ఆల్మట్టి ఎత్తు పెంచితే రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిసి కూడా దానిపైన అసెంబ్లీలో చర్చించడానికి చంద్రబాబుకి గంట సమయం కూడా లేకపోయింది. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు కేంద్రంతో ఆల్మట్టి అంశంపై మాట్లాడతారా లేదో చెప్పాలి. అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాకనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓటేసిన ప్రజలను నమ్మించి వెన్నుపోటు పొడిచారు. ● బనకచర్లపై చంద్రబాబు మాటలు నమ్మగలమా..? రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారం కోసం పోతిరెడ్డిపాడు నుంచి జీఎన్ఎస్ఎస్- హెచ్ఎన్ఎస్ఎస్ లింకు ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి 80 శాతం పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే గాలేరు నగరి నుంచి కుప్పంకి నీరివ్వడం సాధ్యమవుతుంది. అన్నమయ్య జిల్లాలో ఎత్తుగా ఉన్న మదనపల్లె, పుంగనూరు, రాయచోటి ప్రాంతాలకు నీరందుతుంది. వేంపల్లె మండలం వరకు గ్రావిటీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా నీరు ఇవ్వవచ్చు. అక్కడి నుంచి కాలేటి వాగు అనే ప్రాజెక్టు తీసుకొచ్చి లిఫ్టు చేసుకుంటూపోతే కుప్పంకి సులభంగా నీరు ఇచ్చేయవచ్చు. రూ.200 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యే ఈ ప్రాజెక్టు మీద చంద్రబాబు దృష్టిపెట్టడం లేదు. దీన్ని పక్కన పెట్టి రూ. 80 వేల కోట్ల ఖర్చుతో పోలవరం నుంచి బనకచర్లకు నీరిస్తానని గొప్పలు చెబుతున్నాడు. రూ. 200 కోట్లతో ప్రాజెక్టులను పూర్తి చేయలేని చంద్రబాబు, రూ. 80 వేల కోట్లతో బనకచర్ల పూర్తి చేస్తానంటే ఎవరు నమ్ముతారు? ● ప్రజాప్రయోజనాలను తాకట్టు పెట్టి వైయస్ జగన్ పై విమర్శలా ఎనిమిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూస్తే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి మరీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపించింది. ఫర్నిచర్ వెనక్కి ఇవ్వమన్నందుకే కోడెల లాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చంద్రబాబు ప్రచారం చేసి ఆయన మరణాన్ని కూడా రాజకీయం చేశాడు. కోడెల ఆత్మహత్య చేసుకున్న సమయంలో నేను టీడీపీలోనే ఉన్నా. కుటుంబ సమస్యల నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని పార్టీలో చర్చ జరిగింది. వైయస్సార్సీపీ ఇంకా ఫర్నిచర్ ఇవ్వలేదని అసెంబ్లీలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. వైయస్సార్సీపీ ఓడిపోయినప్పుడే ఫర్నిచర్ అప్పగిస్తామని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఫర్నిచర్‌ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, లేదా మేమే తీసుకొచ్చి ఇస్తామని పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి లేళ్ల అప్పిరెడ్డి జీఏడీకి పలుమార్లు లేఖలు రాయడం జరిగింది. ఆఖరుకి ఫర్మిచర్‌ని అప్పగిస్తామని కోర్టుకు వెళ్లడం కూడా జరిగింది. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా వైయస్సార్సీపీ మీద అసెంబ్లీలో నిందలు మోపడం సిగ్గుచేటు. ప్రతిపక్షం లేని అసెంబ్లీని చూడటానికి ప్రజలు కూడా ఇష్టపడటం లేదు. ప్రతిపక్షానికి సమాధానం చెప్పుకోలేక దురుద్దేశపూర్వకంగా వైయస్సార్సీపీ సభ్యులను సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. చిరంజీవిని ఇంటికి పిలిపించి అవమానించారని వైయస్ జగన్ మీద పవన్ కళ్యాణ్ ఎన్నో నిందలు మోపి విష ప్రచారం చేశాడు. వైయస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించి గౌరవించారని చిరంజీవి ఇచ్చిన సమాధానంతో అదంతా రాజకీయ ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ ఆడిన నాటకమని ప్రజలకు తెలిసిపోయింది. ● బాలకృష్ణ వ్యాఖ్యలు కాపులను అవమానించడమే సభా మర్యాదలను ఉల్లంఘించి బాలకృష్ణ వ్యవహరిస్తుంటే సభా నాయకుడు చంద్రబాబు, స్పీకర్ చోద్యం చూస్తూ కూర్చున్నారు. మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి బాలకృష్ణ జుగుప్సాకరంగా మాట్లాడితే కనీసం ఖండించలేదు. చిరంజీవిని వాడు, వీడు అంటే ఆయనకు తప్పనిపించలేదు. చంద్రబాబు అవసరం వచ్చిన్పుడు ఒకలా అవసరం తీరాక మరోలా వ్యవహరిస్తాడు. ఉద్దేశపూర్వకంగా బాలకృష్ణతో చిరంజీవిని తిట్టించాడు. తన అన్న చిరంజీవిని తిడుతుంటే తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు ఇంతవరకు నోరెత్తకపోవడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబు కోసంతమ్ముళ్లిద్దరూ కలిసి అన్నను ఒంటరిని చేశారని కాపు సమాజం మొత్తం మాట్లాడుకుంటోంది. కాపులను అవమానించడం బాలకృష్ణకి పరిపాటిగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణతో చంద్రబాబే మాట్లాడించారు. కాపు కులాన్ని టార్గెట్ గా చేసి చిరంజీవి మీద వాడు, వీడు అంటూ బాలకృష్ణ చెలరేగిపోయాడు. దానిపై దిద్దుబాటు కోసమే చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి పవన్ కళ్యాణ్‌ని కలిశాడు. ఒకవేళ బాలకృష్ణ బ్లడ్డు బ్రీడు అంతగొప్పదైతే కాపు సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకుంటుంటే అడ్డుచెప్పకుండా ఎందుకు అంగీకరించారు? చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి రాజమండ్రి జైలు బయట బాలకృష్ణ ఎందుకు ప్రెస్‌మీట్ పెట్టాడు? కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్లో అశాంతి, అభద్రతాభావం నెలకొని ఉంది. అయినా ప్రజా సమస్యలను గాలికొదిలేసి వైయస్ జగన్‌ని, వైయస్సార్సీపీని నిందించడమే ధ్యేయంగా సమావేశాలు నిర్వహించి ప్రజాధనాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. ● కోర్టు అక్షింతలు వేస్తున్నా మార్పు రాదా? సోషల్ మీడియా కార్యకర్త సవీంద్ర రెడ్డి అక్రమ అరెస్టుపై విచారణ జరిపే బాధ్యతను హైకోర్టు సీబీఐకి అప్పగించడం చూస్తుంటే వైఫల్యాలపై ప్రశ్నించే వారిపట్ల ఈ ప్రభుత్వం ఎంతలా దిగజారి వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. వైయస్సార్సీపీ నాయకులను వేధించడమే ధ్యేయంగా లిక్కర్ స్కాం సృష్టించి సిట్ చేసిన అక్రమ అరెస్టులను హైకోర్టు తీవ్రంగా ఖండిస్తోంది. ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌లు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి వంటి వారికి బెయిల్ ఇచ్చే సందర్భంలో కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వ నియంత పాలనకు నిదర్శనం.